మహేష్.. శంకర్ సినిమా వదులుకుని మరీ

గత కొన్నేళ్లలో తమిళ దర్శకుడు శంకర్ హవా తగ్గిన మాట వాస్తవం. ఐ, 2.0 చిత్రాలతో ఆయన అంచనాలను అందుకోలేకపోయారు. కానీ పదేళ్ల ముందు ఆయన క్రేజ్ మామూలుగా లేదు. ‘రోబో’ సినిమాతో ఆయన ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఆ టైంలో శంకర్‌తో పని చేయడానికి ఇండియాలోని సూపర్ స్టార్లందరూ ఆసక్తి చూపించిన వాళ్లే.

అలాంటి టైంలో మన మహేష్ బాబుకు శంకర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అతను ఆ ఛాన్స్‌ను ‘దూకుడు’ కోసమని మహేష్ వదులుకున్నాడట. శంకర్-మహేష్ కాంబినేషన్ గురించి అప్పట్లో వార్తలొచ్చిన మాట వాస్తవమే కానీ.. ఈ కలయికలో సినిమాకు రంగం సిద్ధమయ్యాక మహేష్ ఈ ప్రాజెక్టును వదులుకున్నాడట. ఈ విషయాన్ని మహేష్‌తో ‘దూకుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘దూకుడు’ సినిమా మొదలయ్యేటప్పటికీ శంకర్‌తో మహేష్‌కు కమిట్మెంట్ ఉందని.. కానీ ఈ చిత్ర షూటింగ్ మధ్య దశలో ఉండగా మహేష్ శంకర్ సినిమాకు నో చెప్పినట్లు వైట్ల తెలిపాడు.

శంకర్‌తో మహేష్ చేయాలనుకున్నది స్ట్రెయిట్ మూవీ కాదని.. అప్పటికే ‘3 ఇడియట్స్’ మూవీని తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేేయడానికి సిద్ధమైన శంకర్, తెలుగులో అదే సినిమాను మహేష్‌తో చేయాలనుకున్నాడని వైట్ల చెప్పాడు. ఐతే ‘దూకుడు’ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం రాసి, ఆ సీన్‌తో పాటు డైలాగులను మహేష్‌‌కు వినిపించగా.. అతను ఫ్లాట్ అయిపోయాడని.. అప్పుడే నమ్రతకు ఫోన్ చేసి తనకు ఈ సినిమా చాలా ముఖ్యం అని, దీని మీదే పూర్తి ఫోకస్ పెట్టాలనుకుంటున్నానని.. అందుకే శంకర్ సినిమా చేయట్లేదని చెప్పేశాడని వైట్ల తెలిపాడు.

తాను స్వయంగా శంకర్‌కు పెద్ద అభిమానినని.. అంత పెద్ద దర్శకుడితో సినిమా వద్దనుకోవడం ఏంటని తాను మహేష్‌తో అన్నానని.. కానీ అతను ‘దూకుడు’కే ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని వైట్ల అన్నాడు.