ఓవర్ హైప్ దెబ్బ తీస్తుందా?


తెలుగు ప్రేక్షకులే కాదు.. తెలుగు సినీ పరిశ్రమ జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ‘లవ్ స్టోరి’. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా వేగంగా పుంజుకుంది కానీ.. సెకండ్ వేవ్ తర్వాత మాత్రం స్ట్రగుల్ తప్పట్లేదు. గత నెలన్నరలో రిలీజైన సినిమాల్లో ఏది కూడా పూర్తి సంతృప్తినివ్వలేదు. ఈ చిత్రాల్లో ఏదీ ఒకప్పట్లా ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించలేకపోయింది. థియేటర్ల పట్ల విముఖతతో ఉన్న ఓ వర్గం ప్రేక్షకుల్లో కదలిక తెచ్చి వెండితెరల ముందు కూర్చోబెట్టే సినిమా సెకండ్ వేవ్ తర్వాత ఇంకా ఏదీ రాలేదనే చెప్పాలి.

ఈ శుక్రవారం రిలీజవుతున్న ‘లవ్ స్టోరి’ సరిగ్గా అలాంటి సినిమానే. ఈ చిత్రానికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ వీకెండ్లో థియేటర్లు కళకళలాడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు పెద్ద ఎత్తున హౌస్ ఫుల్ బోర్డులు కనిపించబోతున్నాయి.

‘లవ్ స్టోరి’ సినిమాకు చిత్ర బృందం కోరుకున్నదానికంటే ఎక్కువ హైప్ వచ్చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి నెగెటివ్ పాయింట్ ఏదీ కనిపించలేదు. సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. పాటలు.. టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతిదానికీ చాలా మంచి స్పందన వచ్చింది. ఇటీవల ప్రి రిలీజ్ ఈవెంట్‌‌కు ముఖ్య అతిథులుగా వచ్చిన ఆమిర్ ఖాన్, చిరంజీవి సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

ఐతే ‘లవ్ స్టోరి’పై మరీ అంచనాలు పెరిగిపోవడం ఇప్పుడు ఈ చిత్రానికి చేటు చేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రేక్షకులు చాలా ఊహించుకుని సినిమాకు వస్తున్నారు. అందుకు తగ్గట్లుగా సినిమా లేకపోతే పెదవి విరుస్తారు. అది సినిమాకు చేటు అవుతుంది. కొన్ని ఫెయిల్యూర్ల తర్వాత శేఖర్ కమ్ముల తీసిన ‘ఫిదా’పై పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వెళ్లడం బాగా కలిసొచ్చింది. వాళ్ల అంచనాలను కమ్ముల మించిపోయాడు. సినిమాకు అసాధారణ ఫలితం దక్కింది. ‘లవ్ స్టోరి’ విషయంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ఓవర్ హైప్‌తో సినిమా రిలీజవుతోంది. మరి అనుకున్నంతగా ఎంరట్టైన్ చేయకపోతే ఏమవుతుందో చూడాలి.