‘లవ్ స్టోరి’ మ్యూజిక్ డైరెక్టర్.. ఇంట్రెస్టింగ్ స్టోరి


సంగీత ద‌ర్శ‌కుల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వాళ్ల‌తో ప‌ని చేయ‌డం ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌కు అల‌వాటు. ఎవ‌రితో ప‌ని చేసినా మంచి ఔట్ పుట్ రాబ‌ట్టుకోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆనంద్, గోదావ‌రి చిత్రాల‌కు రాధాకృష్ణ‌న్ అనే ప్ర‌తిభావంతుడైన సంగీత ద‌ర్శ‌కుడి నుంచి అద్భుత‌మైన పాట‌లు రాబ‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల‌కు మిక్కీ జేయ‌ర్ లాంటి మ‌రో టాలెంటెడ్ మ్యుజీషియ‌న్‌తో అదిరే ఆడియోలు అందించాడు.

ఇక ఫిదాకు శ‌క్తి కాంత్ అనే అంత‌గా ఫేమ్ లేని సంగీత ద‌ర్శ‌కుడి నుంచి గొప్ప ఔట్ పుట్ రాబ‌ట్టాడు. ఇప్పుడు ల‌వ్ స్టోరి మూవీతో సీహెచ్ ప‌వ‌న్ అనే మ‌రో టాలెంటెడ్ మ్యుజీషియ‌న్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశాడు. ఈ సినిమా పాట‌లు ఎంత పాపుల‌ర్ అయ్యాయో తెలిసిందే. ఐతే ప‌వ‌న్ ప్రేక్ష‌కుల‌కు కొత్త కానీ.. ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు మాత్రం కొత్త కాదు.

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ సి.కుమార్ త‌న‌యుడే ఈ ప‌వ‌న్ అన్న విష‌యం మొన్న ల‌వ్ స్టోరి ప్రి రిలీజ్ ఈవెంట్లోనే తెలిసింది. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్ల‌డించ‌డం విశేషం. త‌న కుటుంబానికి స‌న్నిహితుడైన విజ‌య్ కొడుకు ప‌వ‌న్ అంటూ అత‌ణ్ని ఒరేయ్ అని సంబోధిస్తూ స‌భ‌కు ప‌రిచ‌యం చేశాడు చిరు. చెన్నైలోని మ్యూజిక్ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ చేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ ద‌గ్గ‌ర కొన్నేళ్ల పాటు ప‌ని చేశాడ‌ట‌.

రోబో, స‌ర్కార్, ఫ‌కీర్ ఆఫ్ వెనిస్ లాంటి చిత్రాల‌కు రెహ‌మాన్ ద‌గ్గ‌ర ప‌ని చేశాక‌.. శేఖ‌ర్ క‌మ్ముల‌ను క‌లిశాన‌ని.. ఐతే ఫిదా సినిమాలో అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నిస్తే త‌న వ‌ర్క్ న‌చ్చ‌క క‌మ్ముల రిజెక్ట్ చేశాడ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించాడు. ఐతే ఆయ‌న అప్పుడిచ్చిన ఇన్ పుట్స్ తీసుకుని ఆ త‌ర్వాత ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. ల‌వ్ స్టోరి సినిమాకు ఆయ‌న్ని మెప్పించి సంగీతం అందించే అవ‌కాశం అందుకున్నాన‌ని తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ తెలిపాడు.