ఒక భాషలో పెద్ద హిట్టయిన సినిమాను ఇంకో భాషలో రీమేక్ చేసినపుడు.. ఒరిజనల్లో భాగం అయిన వాళ్లు తమ చిత్రమే గ్రేట్ అని ఫీలవుతారు. రీమేక్ ఎంత బాగా తీసినా దాన్ని పొగడ్డానికి మనసు అంగీకరించదు. రీమేక్ విషయంలో విమర్శలు చేసిన వాళ్లు కనిపిస్తారు కానీ ప్రశంసించేవాళ్లు అరుదు.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇదే పని చేశాడు. అతను, బిజు మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ బ్లాక్‌బస్టర్ అయ్యప్పనుం కోషీయుం తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో పృథ్వీ చేసిన కోషీ పాత్రను తెలుగులో రానా చేస్తున్నాడు. ఇక్కడ అతడి పాత్ర పేరు డానియల్ శేఖర్. ఈ పాత్ర టీజర్ సోమవారం రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ టీజర్‌ను పృథ్వీరాజ్ తన చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం.
ఈ సందర్భంగా అతనొక స్పెషల్ నోట్ రిలీజ్ చేశాడు. ఇందులో భీమ్లా నాయక్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. అయ్యప్పనుం కోషీయుం సినిమా, అందులో తాను చేసిన కోషీ పాత్ర తనకు చాలా స్పెషల్ అని చెప్పిన పృథ్వీరాజ్.. ఈ సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేస్తే చాలా బాగుంటుందని దర్శకుడు సాచీ, తాను చాలాసార్లు అనుకున్నామని.. ఐతే తెలుగులో ఇంత పెద్ద స్థాయిలో.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రవిచంద్రన్ లాంటి దిగ్గజాల కలయికలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని.. తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి సంగీతాన్నందిస్తాడని ఊహించలేదని పృథ్వీరాజ్ అన్నాడు.
అన్నింటికీ మించి తన స్నేహితుడైన రానా.. కోషీ పాత్రను చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చే విషయమని.. తన కంటే బాగా అతనీ పాత్ర చేస్తున్నాడనిపిస్తోందని పృథ్వీ కితాబివ్వడం విశేషం. భీమ్లా నాయక్ ప్రోమోలు.. అయ్యప్పనుం కోషీయుం చూసిన వాళ్లలోనూ సినిమాపై అంచనాలు పెంచుతున్నమాట వాస్తవం.