సెన్సార్ అయిపోయింది.. కానీ సస్పెన్స్ వీడట్లేదు


టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కు రీమేక్ సినిమాల పట్ల మక్కువ గురించి తెలిసిందే. ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అందులో ఘనవిజయాలందుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ‘ఎఫ్-2’ తర్వాత ఆయన వరుసగా రెండు రీమేక్ మూవీస్ చేశారు. అందులో ఒకటి ‘నారప్ప’ రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆయన చేసిన మరో రీమేక్ మూవీ ‘దృశ్యం-2’ కూడా ఓటీటీ బాటే పట్టినట్లు ముందు వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్య నిర్మాత సురేష్ బాబు ఆలోచన మారిందని.. థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమాను రెడీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సోమవారం ‘దృశ్యం-2’ ఫస్ట్ లుక్ లాంచ్ అని, అప్పుడే ఈ సినిమా విడుదల విషయంలోనూ స్పష్టత ఇస్తారని వార్తలొచ్చాయి.

కానీ తీరా చూస్తే ఫస్ట్ లుక్ లాంచ్ వాయిదా పడింది. కానీ ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ ఇచ్చారు. ‘దృశ్యం-2’కు సెన్సార్ పూర్తయిందని వెల్లడించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ చేయించేశారంటే ఇక విడుదలే తరువాయి అన్నది స్పష్టమైపోయింది. కానీ రిలీజ్ ఎప్పుడు, ఎలా అన్నదే సస్పెన్స్‌గా మారింది. ఓటీటీ రిలీజ్ అయితే నేరుగా డేట్ ఇచ్చేసేవాళ్లు. ఎందులో రిలీజ్ అనేది చెప్పేసే వాళ్లు. ఇలా సెన్సార్ చేసి ఆగారు అంటే థియేట్రికల్ రిలీజే ఉండొచ్చని తెలుస్తోంది.

ఐతే ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. త్వరలోనే చిరు బృందంతో కలిసి సురేష్ బాబు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపబోతున్నారు. అందులో ఏం తేలుతుందన్నదాన్ని బట్టి ‘దృశ్యం-2’కు రిలీజ్ డేట్ ఇస్తారేమో. పరిస్థితులు సానుకూలంగా ఉంటే దసరాకే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.