‘లవ్ స్టోరీ’లో విషాదమా.. ఛాన్సే లేదు


‘లవ్ స్టోరి’ సినిమాలో కథ కులాంతర ప్రేమ చుట్టూ తిరుగుతుందన్న సంకేతాలు మొదట్నుంచి ఉన్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూసినా అది నిజమే అనిపిస్తోంది. జీవితంలో స్థిరపడటానికి కష్టపడుతున్న వేర్వేరు కులాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి మధ్య పరిచయం ఏర్పడటం.. ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలవడం.. తర్వాత ప్రేమలో పడటం.. ఇంతలో ఇరు కుటుంబాల పెద్దలకు విషయం తెలిసి వీరి పెళ్లికి అడ్డు చెప్పడం.. ఈ క్రమంలో సాగే పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని స్పష్టమవుతోంది.

ఐతే ఈ కథ రాయడానికి శేఖర్ కమ్ములకు మిర్యాలగూడ విషాదాంతం స్ఫూర్తిగా నిలిచిందని.. ఈ సినిమా కూడా విషాదాంతమే అని.. క్లైమాక్స్ హార్ట్ బ్రేకింగ్‌గా ఉంటుందని మీడియాలో ఒక ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. కానీ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం అలాంటిదేమీ ఉండదనే అంటున్నారు.

కులాంతర ప్రేమల విషయంలో సమాజం స్పందించే తీరు ఎలా ఉంటుందో జనరల్‌గా చూపించే ప్రయత్నం మాత్రమే ఈ సినిమాలో జరిగిందని.. పర్టికులర్‌గా ఒక ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకోలేదని.. ఈ సినిమా విషాదాంతం ఎంతమాత్రం కాదని చిత్ర వర్గాలు అంటున్నాయి. తాజాగా ‘లవ్ స్టోరి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన చిత్ర నిర్మాతలు కూడా ‘ఈ సినిమా గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మిర్యాలగూడ ఉదంతంతో ఈ సినిమాకు సంబంధం లేదని.. ఇది శేఖర్ కమ్ముల స్టయిల్లో సాగే లైట్ హార్టెడ్ మూవీ అని స్పష్టత ఇచ్చారు.

విషాదాంతపు ప్రేమకథలు తమిళంలో బాగా ఆడతాయి కానీ.. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటివి రుచించవు. మన దగ్గర అలాంటి ముగింపునిస్తే సినిమా రిజల్ట్ తేడా కొట్టొచ్చు. కాబట్టే నిర్మాతలు కూడా ఇలా క్లారిటీ ఇచ్చినట్లున్నారు. కాబట్టి కమ్ముల స్టయిల్లో ఆహ్లాదంగా.. కొంచెం ఎమోషనల్‌గా సాగే ప్రేమకథ అనే అంచనాలతో ‘లవ్ స్టోరి’ చూసేందుకు వెళ్లొచ్చు.