దృశ్యం సంచ‌ల‌నాలు ఇంకా ఆగ‌ట్లేదు

ఇండియాలో టాప్ ఫిలిం ఇండ‌స్ట్రీలంటే ముందుగా బాలీవుడ్ పేరు చెప్పి.. ఆ త‌ర్వాత టాలీవుడ్, కోలీవుడ్‌ల పేర్లు చెబుతాం. మిగ‌తా చిన్న ఫిలిం ఇండ‌స్ట్రీల్లో మాలీవుడ్ ఒక‌టి. అక్క‌డ సినిమాల క్వాలిటీకి ఢోకా ఉండ‌దు కానీ.. దాని మార్కెట్ ప‌రిధి చిన్న‌ది. అందువ‌ల్ల మ‌ల‌యాళ సినిమాలు గ‌తంలో అనుకున్నంత పాపుల‌ర్ కాలేదు.

కానీ గ‌త కొన్నేళ్లలో ప‌రిస్థితులు మారాయి. ఓటీటీల హ‌వా పెరిగిన ఈ డిజిట‌ల్ కాలంలో మ‌ల‌యాళ సినిమాల‌కు బాగా గిరాకీ పెరిగింది. అక్క‌డి సినిమాల‌ను వేరే భాష‌ల వాళ్లు బాగా చూస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రాలు వివిధ భాష‌ల్లో పెద్ద ఎత్తున రీమేక్ అవుతున్నాయి. ఈ ఒర‌వ‌డి మొద‌లు కావ‌డానికి ముందే దృశ్యం సినిమా ప‌లు భాష‌ల్లోకి వెళ్లింది. తెలుగు, త‌మిళం, హిందీ, బెంగాలీ, క‌న్న‌డ భాష‌ల్లో దృశ్యం రీమేక్ అయి అన్ని చోట్లా విజ‌య‌వంతం కావ‌డం విశేషం.

ఐతే ఓ చిత్రం వివిధ‌ భారతీయ భాష‌ల్లో మాత్ర‌మే రీమేక్ అయితే అందులో ప్ర‌త్యేక‌తేమీ లేదు. కానీ దృశ్యం ఇప్ప‌టికే రెండు విదేశీ భాష‌ల్లోకి కూడా వెళ్ల‌డం గ‌మ‌నార్హం. శ్రీలంక‌లో సింహ‌ళీస్ భాష‌లో దీన్ని రీమేక్ చేశార‌. అలాగే చైనీస్ లాంగ్వేజ్‌లో సైతం దృశ్యం తెర‌కెక్కింది. ఆ భాష‌ల్లోనూ విజ‌య‌వంత‌మైంది. చైనాలో ఈ సినిమా విజ‌య‌వంతం కావడంతో.. దానికి కొన‌సాగింపుగా సొంతంగా సీక్వెల్ తీయ‌డం విశేషం.

కాగా ఇప్పుడు దృశ్యం మ‌రో విదేశీ భాష‌లోకి వెళ్తోంది. ఇండొనేషియా భాష‌లో దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందుకోసం అధికారికంగా రీమేక్ రైట్స్ కూడా కొన్నారు. ఒక భార‌తీయ ప్రాంతీయ భాషా చిత్రం ఇలా ఇన్ని భాష‌ల్లోకి వెళ్ల‌డం.. అందులో మూడు విదేశీ భాష‌లు కూడా ఉండ‌టం అరుదైన విష‌యం. ఇండియాలో ఇదొక అరుదైన రికార్డ‌ని చెప్పొచ్చు. దృశ్యం సీక్వెల్ సైతం అద్భుత‌మైన స్పంద‌న రాబ‌ట్టుకుని వివిధ భాష‌ల్లో రీమేక్ అవుతుండటం విశేషం.