రాజమౌళి-కీరవాణిల కుటుంబంలో చాలామంది ప్రతిభావంతులున్నారు. అందరి లిస్టు తీస్తే ఆ నంబర్ డబుల్ డిజిట్‌కు చేరుతుంది. లిటిల్ సోల్జర్స్ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు నిర్మాతగా అమృతం లాంటి క్లాసిక్ సీరియల్‌ను, ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి అద్భుత చిత్రాలను అందించిన గుణ్ణం గంగరాజు సైతం ఈ కుటుంబానికి చెందిన వాడే.
ఐతే ఆయన కొన్నేళ్లుగా అంతగా యాక్టివ్‌గా లేరు. ఆయన వారసత్వాన్నందుకున్న తనయుడు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా మారాడు. రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా, కీరవాణి కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా అశ్విన్ తీసిన తొలి చిత్రం.. ఆకాశవాణి. మధ్యలో ఏవో అభిప్రాయ భేదాలొచ్చి కార్తికేయ ఈ సినిమా నుంచి తప్పుకుంటే పద్మనాభరెడ్డి అనే వేరే నిర్మాత దాన్ని టేకప్ చేశారు.
కొన్ని నెలల ముందు టీజర్‌తో పలకరించిన ఆకాశవాణి.. ఇప్పుడు రిలీజ్ అప్‌డేట్‌తో వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో విడుదల కానుంది. ఈ మధ్యే వివాహ భోజనంబు మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన సోనీ లివ్ ద్వారా ఆకాశవాణి రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రిమియర్స్ పడబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించగా.. మిగతా అందరూ దాదాపుగా కొత్తవాళ్లే నటించారు.
దీని టీజర్ చూస్తే ప్రస్తుత వాతావరణానికి దూరంగా ఏదో ఒక ప్రత్యేక ప్రదేశంలో నాగరికతకు దూరంగా ఉన్న జనాల మధ్య నడిచే కథలా కనిపిస్తోంది. ఒక రేడియో చుట్టూ తిరిగే కథలాగా అనిపిస్తోంది. తన తండ్రి లాగే అశ్విన్ ఒక ప్రయోగాత్మక కథతో ఈ సినిమా తీసినట్లున్నాడు. మరి ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.