మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కోసం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీత కచేరి చేయబోతున్నారట. డిసెంబర్లో ఈ కార్యక్రమం జరగనుందట. ఇందుకోసం ఇళయరాజాతో మాట్లాడ్డం కూడా అయిపోయిందని, ఆయన ఓకే కూడా అన్నారని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ చెప్పడం విశేషం. తాను అధ్యక్షుడిగా గెలవగానే మా కోసం రూ.10 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయబోతున్నానని.. ఈ డబ్బులు ఎలా తేవాలో తనకు తెలుసని ఆయనన్నారు. నిధుల సేకరణలో భాగంగా ముందుగా ఇళయరాజాతో కచేరి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఈ విషయంలో ఇళయరాజాను అడిగితే నువ్వు అడిగితే నేనెందుకు చేయని అన్నారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఐతే ఇళయరాజా కచేరి చేయడానికి మామూలుగా రూ.3 కోట్లు తీసుకుంటారని.. కానీ తాను తగ్గించమని అడిగితే కోటి రూపాయలు చెప్పారని.. అంతెందుకు అవుతుందని అడిగితే చిత్ర, హరిహరన్ లాంటి సింగర్లను తీసుకురావాలంటే అంత ఖర్చు తప్పదని ఇళయరాజా చెప్పారని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఆయన ముందే తాను చిత్ర, హరిహరన్‌లకు ఫోన్ చేసి మాట్లాడానని.. తాను అడిగితే కచేరికి ఎందుకు రామనే వాళ్లు కూడా అన్నారన్నారు.
మా అసోసియేషన్ ఇళయరాజా గారి కచేరితో డబ్బులు సంపాదిస్తుందని.. ఈ కచేరి జరగడం తథ్యమని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఐతే ప్రకాష్ రాజ్ గెలిస్తేనే ఇళయరాజా కచేరి పెట్టిస్తాడా.. ఒక వేళ ఆయన ఓడిపోతే కూడా ఈ కచేరి బాధ్యత తీసుకుంటాడా అన్నది ఆసక్తికరం. వచ్చే నెల మధ్యలో మా ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు. బరిలో ఉన్న అందరిలో ప్రకాష్ రాజ్ చాలాముందు నుంచే దూకుడుగా ప్రచారం సాగిస్తూ ముందంజలో నిలుస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates