స‌లార్.. యాక్ష‌న్ యాక్ష‌న్ యాక్ష‌న్


మ‌న ప్రేక్ష‌కుల అభిరుచి ఎంత‌గా మారినా స‌రే.. పాట‌లు, ఫైట్ల విష‌యంలో మోజు మాత్రం త‌గ్గ‌దు. ఇప్ప‌టికీ పాట‌లు.. ఫైట్ల కోసం సినిమాలు చూసే ప్రేక్ష‌కులు పెద్ద సంఖ్య‌లోనే ఉన్నారు. వాటిని ఎంత కొత్త‌గా తీర్చిదిద్దుతార‌న్న‌ది కీల‌కం. గ‌త కొన్నేళ్ల‌లో వ‌చ్చిన సినిమాల్లో యాక్ష‌న్ ఘ‌ట్టాల విష‌యంలో ప్రేక్ష‌కుల‌కు ఒక కొత్త అనుభూతిని పంచిన చిత్రంగా కేజీఎఫ్‌ను చెప్పుకోవాలి.

ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్ల‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేసింది. ఆ సినిమా చూసిన తెలుగు ప్రేక్ష‌కుల్లో చాలామందికి ఛ‌త్ర‌ప‌తి గుర్తుకొచ్చింది. అంతే కాక ఈ సినిమాలో ప్ర‌భాస్ న‌టించి ఉంటే ఎలా ఉండేద‌న్న ఊహ కూడా చాలామందిలో క‌లిగింది. ఐతే ప్ర‌శాంత్-ప్ర‌భాస్ క‌ల‌యిక కోసం ఎక్కువ‌గా ఎదురు చూడాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది.

కేజీఎఫ్ః చాప్ట‌ర్-2 పూర్తి కాగానే ప్ర‌భాస్‌తో జ‌ట్టు క‌ట్టేశాడు ప్ర‌శాంత్. వీరి క‌ల‌యిక‌లో స‌లార్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఇది ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అని తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని.. మూడో షెడ్యూల్లోకి అడుగు పెడుతోంది స‌లార్. ఐతే ఈ మూడు షెడ్యూళ్ల‌నూ పూర్తిగా యాక్ష‌న్ ఘ‌ట్టాల‌కే కేటాయించార‌ట‌. తొలి రెండు షెడ్యూళ్ల‌లో ఫైట్లు మాత్ర‌మే తీసిన ప్ర‌శాంత్.. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌నూ యాక్ష‌న్ సీన్లే తీస్తున్నాడ‌ట‌.

సినిమాలో అత్యంత కీల‌క‌మైన‌వి, క‌ష్టంతో కూడుకున్న‌వి యాక్ష‌న్ ఘ‌ట్టాలేన‌ట‌. అందుకే వాటినే ముందు తీసేసి.. మిగ‌తా టాకీ పార్ట్ త‌ర్వాత తీసేలా ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. ప్ర‌భాస్ ఈ స‌న్నివేశాల కోసం చాలానే క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌శాంత్ సినిమాలో ప్ర‌భాస్ యాక్ష‌న్ ఘ‌ట్టాలు ఎలా ఉంటాయో అన్న ఊహే ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ ఇస్తోంది. మ‌రి ఈ అంచ‌నాల‌ను ప్ర‌శాంత్-ప్ర‌భాస్ ఏమేర అందుకుంటారో చూడాలి.