ఆర‌డుగుల బుల్లెట్ వ‌స్తోంది

గోపీచంద్ హీరో.. న‌య‌న‌తార హీరోయిన్.. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు.. ఇంత పెద్ద కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా విడుద‌ల‌కు నోచుకోకుండా ఏళ్ల‌కు ఏళ్లు ఆగిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. ముందు భూప‌తి రాజా అనే త‌మిళ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను మొద‌లుపెట్టి.. మ‌ధ్య‌లో అత‌ను త‌ప్పుకుంటే గోపాల్ డైరెక్ట‌ర్ చైర్‌లోకి వ‌చ్చారు. ఆయ‌నే సినిమాను పూర్తి చేశారు. ఆర‌డుగుల బుల్లెట్ అంటూ ఈ చిత్రానికి మాస్ టైటిల్ కూడా పెట్టారు. సినిమా పూర్త‌యింది. త్వ‌ర‌లో విడుద‌ల అన్నారు. కానీ ఏం జ‌రిగిందో ఏమో సినిమా బ‌య‌టికి రాలేదు.

ఐదేళ్ల ముందే విడుద‌ల కావాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదా ప‌డింది. ఒక ద‌శ‌లో విడుద‌ల‌కు అన్నీ సిద్ధం చేసి ప‌త్రిక‌ల్లో యాడ్స్ ఇచ్చి.. థియేట‌ర్ల లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అంతా ఓకే అనుకున్నాక విడుదల రోజు బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాత ఆర‌డుగుల బుల్లెట్ అడ్ర‌స్ లేదు.

ఐతే చాన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఈ చిత్రాన్ని వార్త‌ల్లోకి తీసుకొచ్చారు. అక్టోబ‌ర్ రిలీజ్ అంటూ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. బ‌హుశా గోపీచంద్ కొత్త సినిమా సీటీమార్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని, మంచి ఓపెనింగ్స్‌తో సాగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్ర బృందంలో ఉత్సాహం వ‌చ్చిన‌ట్లుంది. ఫైనాన్స్ స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గించుకుని నిజంగానే అక్టోబ‌రు రిలీజ్‌కు ఈ చిత్రం రెడీ అవుతున్న‌ట్లుగా ఉంది. బాలాజి రియ‌ల్ మీడియా బేన‌ర్ మీద తాండ్ర ర‌మేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి క‌థ అందించింది వ‌క్కంతం వంశీ కావ‌డం విశేషం.

మ‌రి ఏడెనిమిదేళ్ల ముందు రాసిన స్క్రిప్టుతో ఈ సినిమా ఇప్పుడు ప్రేక్ష‌కులకు ఎలా అనిపిస్తుందో చూడాలి. సినిమా మీద పెద్ద‌గా అంచ‌నాల్లేవు కానీ.. కోట్లు ఖ‌ర్చు పెట్టి తీసిన సినిమా ఎలాగోలా రిలీజైతే అదే చాల‌ని దాని టీం అనుకుంటోంది.