దసరాకు రిలీజయ్యే తెలుగు సినిమాల లైనప్ విషయంలో క్లారిటీ వచ్చినట్లే ఉంది. కానీ రావట్లేదు. ఈ పండక్కి వారం రోజుల ముందే రెండు సినిమాలు విడుదలకు ముహూర్తం చూసుకున్నాయి. అక్టోబరు 8న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు ‘కొండపొలం’ రిలీజ్ కానున్నాయి. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను కన్ఫమ్ చేసింది. ‘కొండపొలం’ విషయంలోనూ సందేహాలేమీ లేవు.
ఐతే దసరా వీకెండ్లో వచ్చే సినిమాలేవన్నదే తెలియడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా అనివార్యం కావడం.. ‘ఆచార్య’ కూడా అప్పటికి రెడీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో అందరి చూపూ నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ’ మీదే ఉంది. ఈ చిత్రం దసరాకు పక్కా అనే అంటున్నారు. కానీ ఇంకో ఐదు వారాల సమయం మాత్రమే మిగిలుండగా.. ఈ సినిమా దసరా రిలీజ్‌ను కన్ఫమ్ చేస్తూ ప్రకటన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాకు రిలీజ్ డేట్ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందన్నది అర్థం కావడం లేదు. ఐతే బాలయ్య అండ్ కో.. ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఓ బృందం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
కొన్ని కారణాల వల్ల ఈ మీటింగ్ ఆలస్యమవుతోంది. ఆ సమావేశం పూర్తయి, టికెట్ల రేట్ల విషయంలో సానుకూల నిర్ణయం వెలువడితే ‘అఖండ’ దసరా రిలీజ్‌ను ఖరారు చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు ‘లవ్ స్టోరి’ సహా వేరే సినిమాల విడుదల విషయంలోనూ క్లారిటీ అప్పుడే రావచ్చు. దసరా వీకెండ్లో ‘అఖండ’ మినహా వేరే సినిమా ఏదీ రేసులో లేకుంటే.. ‘లవ్ స్టోరి’ని ఆ పండక్కే రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.