నిన్నుకోరి సినిమాతో అరంగేట్రంలోనే తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శివ నిర్వాణ. చాలామంది దర్శకుల్లా అతణ్ని ద్వితీయ విఘ్నం వెంటాడలేదు. రెండో చిత్రం మజిలీతోనూ అతను ఘనవిజయాన్నందుకున్నాడు. ఇప్పుడు నాని హీరోగా టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకుల తీర్పు కోరుతున్నాడు. ఈ సినిమా వినాయకచవితి కానుకగా ఈ నెల 10న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
దీని తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా శివ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఈ మధ్య ఈ సినిమాపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఆగిపోయినట్లుగా వార్తలొచ్చాయి. శివ చెప్పిన కథ విజయ్‌కి నచ్చలేదని.. మార్పులు అడిగితే శివ చేయలేదని.. దీంతో సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని రూమర్లు వినిపించాయి.
ఇటు విజయ్, అటు శివ నుంచి కూడా ఈ సినిమా గురించి సంకేతాలు లేకపోవడంతో ఈ రూమర్లు నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు శివ ఈ సినిమాపై పెదవి విప్పాడు. విజయ్‌తో తన సినిమా తప్పకుండా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. టక్ జగదీష్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అతను.. విజయ్‌తో తన దర్శకత్వంలో సినిమా త్వరలోనే మొదలవుతుందన్నాడు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు కూడా అతను వెల్లడించాడు.
అతను చెబుతున్నదాన్ని బట్టి చూస్తే లైగర్ తర్వాత విజయ్ చేసే సినిమా ఇదే కావచ్చు. మరోవైపు టక్ జగదీష్ సినిమాకు తమన్‌ను పాటల వరకు పరిమితం చేసి నేపథ్య సంగీతం గోపీసుందర్‌తో చేయించడంపై శివ స్పందిస్తూ.. మజిలీ సినిమాకు గోపీ పాటలు ఇస్తే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడని.. ఇప్పుడు దాన్ని రివర్స్ చేశామని.. ఈ ఫ్యామిలీ డ్రామాకు గోపీ ఆర్ఆర్ బాగుంటుందని అతడితో చేయించామని చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates