మ‌హేష్ బాబుతో న‌భా న‌టేష్‌?


న‌న్ను దోచుకుందువ‌టే అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది క‌న్న‌డ భామ న‌భా న‌టేష్. ఆ సినిమాలో అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఆమెకు ఆ త‌ర్వాత తెలుగులో మంచి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె మీడియం రేంజ్ సినిమాల్లోనే న‌టించింది. కెరీర్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ కోసం న‌భా వేచి చూస్తోంది. ఎట్ట‌కేల‌కు ఆ అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఇప్ప‌టిదాకా పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశం అందుకోని న‌భాకు. . ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చిత్రంతో టాప్ లీగ్‌లోకి వెళ్లే ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు తాజా స‌మాచారం. స‌ర్కారు వారి పాట త‌ర్వాత మ‌హేష్ చేయ‌నున్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాలో న‌భా సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే లీడ్ హీరోయిన్‌గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని గురించి ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఐతే త్రివిక్ర‌మ్ సినిమాల్లో చాలా వ‌ర‌కు రెండో హీరోయిన్ పాత్ర ఉంటుంది. హీరోకు జోడీగా న‌టించ‌క‌పోయినా.. స్పెష‌ల్ క్యారెక్ట‌ర్లో మ‌రో అంద‌మైన భామ‌ను ఆక‌ర్ష‌ణ కోసం పెడుతుంటాడు. ఈ సెంటిమెంటును మ‌హేష్ సినిమాకు కూడా కొన‌సాగించ‌నున్నాడ‌ని.. ఆ పాత్ర‌లోనే న‌భా న‌టించ‌బోతోంద‌ని అంటున్నారు.

ఈ వార్త నిజ‌మే అయితే.. న‌భా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. పాత్ర ప్రాధాన్య సంగ‌తెలా ఉన్న‌ప్ప‌టికీ మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తే వ‌చ్చే క్రేజే వేరు. చివ‌ర‌గా అల్లుడు అదుర్స్ సినిమాలో క‌నిపించిన న‌భా.. ఈ నెల 17న హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానున్న మ్యాస్ట్రోతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.