ఏమైనా మాటలతో ఎక్కడికో తీసుకెళ్లటం.. పోస్టులతో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేయటం.. వివాదాలతో ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉండటం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలిసినంత బాగా టాలీవుడ్ లో మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇంతకాలం తన పోస్టులతో సంచలనాలు రేపే ఆయన.. ఈ మద్యన ముద్దుగుమ్మలతో ఆయన చేస్తున్న వీడియోలు.. తీసుకుంటున్న ఫోటోల్ని పోస్టు చేసి కొత్త తరహా చర్చకు తెర తీస్తున్నారు. ఈ మధ్యన మాంచి మందు మూడ్ లో తానెలా చెలరేగిపోతారో అందరికి తెలిసేలా చేశారు వర్మ.
తాజాగా “డియర్ మేఘ” మూవీ ప్రీరిలీజ్ వేడుకకు వెళ్లిన వర్మ.. ఆ సినిమా హీరోయిన్ మేఘా ఆకాశ్ ను తన మాటలతో ఫిదా చేసేశారని చెప్పాలి. ఆయన వేసిన భారీ బిస్కెట్ కు పాపం ఆ హీరోయిన్ ఫ్లాట్ అయిపోవటమే కాదు.. గాల్లో తేలిపోయేలా వర్మ కామెంట్ ఉందని చెప్పాలి. ఈవెంట్ లో మాట్లాడిన వర్మ.. తనకు నలభై ఏళ్ల క్రితం మేఘా ఆకాశ్ లాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. తానిప్పుడు ఇలా ఉండేవాడిని కాదన్నారు.

“మేఘా చాలా స్వీట్ గా ఉంటుంది. తనని కలిసిన వారికి డయాబెటిస్ వస్తుందని నా అభిప్రాయం. 40 ఏళ్ల క్రితం నాకిలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. మేఘని పొగిడినట్లు హీరో అదిత్ ను పొగిడితే నన్ను మరోలా అనుకుంటారు కాబట్టి అలా చేయను. అదిత్ మంచి నటుడు” అని వ్యాఖ్యానించారు.
ఈ వీకెండ్ లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా ఈ మూవీని చెబుతున్నారు. వర్మ తాజా వ్యాఖ్యలతో.. మేఘా ఆకాశ్ ను ఒక్కసారి ఆగి చూసే అవకాశం ఉందని చెప్పాలి. ఏమైనా హీరోయిన్లను పొగడటం.. మాటలతో వారి మనసుల్నిదోచేయటం వర్మకే సాధ్యమని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates