ఎన్టీఆర్ జయంతి రోజున ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఓ అనవసర వివాదానికి తెరతీశారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో సాధ్యమైంత త్వరగా సినీ కార్యకలాపాలు మొదలుపెట్టే దిశగా ప్రభుత్వంతో సినీ పెద్దలు నిర్వహించిన చర్చా కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహంతో కొన్ని అనవసర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న వాళ్లంతా.. భూములు పంచుకోవడం గురించి మాట్లాడటానికి వెళ్లారంటూ బాలయ్య వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ టాపిక్ వరకు వెళ్లకుండా బాలయ్యను ఆహ్వానించకపోవడంపై ఆయన సన్నిహితుడు.. సమావేశాల్లో పాల్గొన్న సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఇప్పటికే స్పందించారు. పరిశ్రమకు సంబంధించి పనులు కావడం కోసం ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్లామని.. బాలయ్య అవసరమైతే బాలయ్యను పిలుస్తామని వ్యాఖ్యానిస్తూ వ్యవహారాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారాయన.
మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాలయ్య వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా బాలయ్య వ్యాఖ్యల అనంతరం సంబంధిత సన్నివేశాలు ముగిసి నిర్ణయాలు కూడా జరిగిన నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దర్శకుడు రాజమౌళి, సీనియర్ హీరో నాగార్జున తదితరులు మీడియాతో మాట్లాడారు. నాగ్ మాట్లాడుతుండగా.. చివర్లో బాలయ్య వ్యాఖ్యలపై విలేకరులు స్పందించారు. ఐతే నాగ్ ఒక చిరు నవ్వు నవ్వేసి ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారు. మధ్యలో తలసాని జోక్యం చేసుకుని ఇప్పుడు దాని గురించి మాట్లాడలేమని, అవతలి వాళ్లు ఏదో వివాదం రాజేయాలని చూస్తున్నారని అంటూ నవ్వేశారు. బాలయ్యతో చాలా ఏళ్లుగా నాగార్జునకు సత్సంబంధాలు లేని నేపథ్యంలో ఆయనకు బాలయ్య తాజా వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురయ్యేసరికి ఏం చెబుతారా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కానీ ఆయన వ్యూహాత్మక మౌనం పాటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates