నిఖిల్ సినిమాకి మోక్షం ఎప్పుడు..?

టాలీవుడ్ లో హీరోలంతా ఇప్పుడు యమా జోరుమీదున్నారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో దర్శకనిర్మాతలకు హీరోలు దొరకడం లేదు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా బాగా బిజీ అయిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సీనియర్ హీరోలే నాలుగైదు సినిమాలు పట్టాలెక్కిస్తుంటే ఇక కుర్ర హీరోలు ఇంకెంత స్పీడ్ గా ఉండాలి చెప్పండి. కానీ యంగ్ హీరో నిఖిల్ పరిస్థితి మాత్రం అలా లేదు.

2018లో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత ‘అర్జున్ సురవరం’ రిలీజైనా.. అది రెండేళ్లు పాటు ల్యాబ్ లోనే ఉండిపోయి బయటకొచ్చింది సినిమా. ఆ లెక్కన చూసుకుంటే ఈ మూడేళ్లలో నిఖిల్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కొన్నాళ్లుగా ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ దర్శకుడు సూర్యప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ లో చాలా ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం నిఖిల్ కానప్పటికీ.. ఆ ఎఫెక్ట్ మాత్రం నిఖిల్ కెరీర్ పై పడుతోంది. ’18 పేజెస్’ సినిమా విడుదలై.. రిజల్ట్ తేలేవరకు మరో సినిమా ఒప్పుకోకూడదని అనుకుంటున్నాడు నిఖిల్. కానీ ఆ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. మొన్నామధ్య రీషూట్ కూడా చేశారు. అందుకే.. అనుకున్నదానికంటే ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో తొలిసారి నిఖిల్ తో రొమాన్స్ చేయబోతుంది అనుపమ పరమేశ్వరన్.