లాక్ డౌన్ స్టోరీతో ‘పాగల్’ హీరో!

Vishwak Sen

దేశంలో కరోనా అలజడి పెరగడంతో అదే కాన్సెప్ట్ తో మన దర్శకులు కొన్ని కథలు రాసుకున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కాన్సెప్ట్ తో రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. కమెడియన్ సత్య నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే ‘మంచి రోజులొచ్చాయి’, ‘WWW’ లాంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కథలతో తెరకెక్కుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా లాక్ డౌన్ కథతో సినిమా చేస్తున్నాడు. విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఇది లాక్ డౌన్ కథ అని తెలుస్తోంది. ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్తుంది అబ్బాయి ఫ్యామిలీ. అదే రోజున సడెన్ గా లాక్ డౌన్ అనౌన్స్ చేస్తారు. దీంతో అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కథ ప్రకారం సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుందట. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ ను కూడా నిర్మించారు. షూటింగ్ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నా.. ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటివరకు మాస్, యూత్ ఆడియన్స్ ను అలరించే సినిమాలు తీసిన విశ్వక్ సేన్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడా చూడాలి!