బెల్లంకొండ-2.. అప్పుడే రెండోది


యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ కెరీర్ ఆరంభం నుంచి ఎలా పుష్ చేస్తున్నారో తెలిసిందే. నటన పరంగా మొదట్నుంచి శ్రీనివాస్ తడబడుతూనే ఉన్నప్పటికీ.. అతడికి పెద్ద పెద్ద దర్శకులతో భారీ సినిమాలు చేసే అవకాశం దక్కింది. టాలీవుడ్ బడా స్టార్ల సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో అతడి సినిమాలపై బడ్జెట్లు పెడుతుంటారు. కాస్ట్ అండ్ క్రూ అంతా టాప్ లెవెల్లో ఉంటుంది. తెలుగులో హీరోగా ఇంకా సరిగా నిలదొక్కుకోకపోయినా అప్పుడే బాలీవుడ్లో కూడా అడుగు పెట్టేస్తున్నాడు శ్రీనివాస్. అతను హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

శ్రీనివాస్ సంగతలా ఉంచితే.. ఆల్రెడీ అతడి తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రేమ కాదల్ ఇష్క్, సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ మూవీ ‘వివాహ్’కు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా కొంచెం ఆలస్యం అవుతోంది. ఐతే ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే గణేష్ హీరోగా ఓ కొత్త సినిమా మొదలైపోయింది.

‘నాంది’తో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సతీష్ వర్మ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం. రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇదొక కొత్త తరహా థ్రిల్లర్ మూవీ అట. సోమవారమే హైదరాబాద్‌లో ఈ చిత్రానికి ప్రారంభోత్సవం జరిపారు. దిల్ రాజు, అల్లరి నరేష్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య మళ్లీ ఈ సినిమాకు పాటలు రాస్తుండటం విశేషం. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. తక్కువ బడ్జెట్లో, వేగంగా ఈ సినిమా పూర్తి చేయడానికి ప్లాన్ చేసిందట చిత్ర బృందం.