మెగాస్టార్ చిరంజీవి అంటే అసలు ఇష్టపడని వేరే హీరోల అభిమానులు కూడా ఆంతరంగిక సంభాషణల్లో ఆయన గొప్పదనాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అలాంటిది. ఆ కష్టం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
సినిమా వాళ్లనే కాదు.. మామూలు జనాలను కూడా ఇన్స్పైర్ చేసింది. అందుకే చిరు గొప్పదనాన్ని ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఇండస్ట్రీలో మెగా హీరోలకు, నందమూరి హీరోలకు పైకి చెప్పుకోని ఒక వైరం ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీరి అభిమానులైతే బయట, సోషల్ మీడియాలో మామూలుగా కొట్టుకోరు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన గొప్ప మాటలు ఇప్పుడందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి.
రామ్ చరణ్ అతిథిగా హాజరైన ఎవరు మీలో కోటీశ్వరులు అరంగేట్ర ఎపిసోడ్లో హోస్ట్ తారక్.. చిరంజీవి గురించి ఒక మంచి కామెంట్ చేశాడు. చిరంజీవి ఇంట్లో తమకు ఒక ఆచార్య లాంటి వాడే అంటూ ఆయన తమనెలా తీర్చిదిద్దాడో చరణ్ వివరించగా.. చిరంజీవి గారు మీకు ఇంట్లో ఆచార్య అయితే.. బయట మాకందరికీ ఆచార్య అని తారక్ పేర్కొనడం విశేషం.
మరోవైపు పవన్ కళ్యాణ్‌తో అనుబంధం గురించి చరణ్‌ను తారక్ ప్రశ్నించగా.. చిన్నతనం నుంచి తన తండ్రి బిజీగా ఉండటంతో ఆయన ఏం చెప్పాలనుకున్నా అవన్నీ బాబాయి ద్వారా చెప్పించేవారని.. ఆయన తండ్రి తర్వాత తండ్రిలా, అన్నయ్యలా తమను చూసుకున్నారని చరణ్ అన్నాడు. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని తాను ఆ దేవుణ్ని ప్రార్థిస్తానని తారక్ అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates