గాడ్‌ఫాద‌ర్‌లో స‌ల్మాన్.. డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడంటే?


బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఓ తెలుగు సినిమాలో న‌టించ‌బోతున్నాడ‌ని కొన్ని రోజులుగా ఆస‌క్తిక‌ర రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఆ సినిమా.. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్. ఇది మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్‌కు రీమేక్ కాగా.. ఒరిజిన‌ల్లో పృథ్వీరాజ్ చేసిన క్యామియో రోల్‌ను తెలుగులో స‌ల్మాన్ చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇది వాస్త‌వ‌మే అని కొంద‌రు.. ఉత్త ప్ర‌చార‌మే మ‌రికొంద‌రు అంటున్నారు. మీడియాలో కూడా ర‌క‌ర‌కాలుగా వార్త‌లొస్తున్నాయి.

ఐతే ఇదే విష‌యాన్ని గాడ్‌ఫాద‌ర్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాను అడిగితే సూటిగా స‌మాధానం చెప్ప‌లేదు. చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆదివారం పెట్టిన ట్విట్ట‌ర్ స్పేస్‌కు అతిథిగా వ‌చ్చిన మోహ‌న్‌ను హోస్ట్ సుమ దీని గురించి ప్ర‌శ్నించింది. గాడ్‌ఫాద‌ర్‌లో స‌ల్మాన్ న‌టిస్తున్న విష‌యం నిజ‌మేనా అని అడిగింది.

దీనికి మోహ‌న్ రాజా స‌మాధానం దాట‌వేశాడు. స‌ల్మాన్ త‌మ చిత్రంలో న‌టిస్తున్నాడ‌ని కానీ.. న‌టించ‌ట్లేద‌ని కానీ చెప్ప‌లేదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడ్డం తొంద‌ర‌పాటు అవుతుంద‌ని.. స‌రైన స‌మ‌యంలో అన్ని విష‌యాలూ రివీల్ అవుతాయ‌ని.. ప్రేక్ష‌కుల్ని ఎగ్జైట్ చేసేలాగే ఆ అప్‌డేట్స్ ఉంటాయ‌ని మోహ‌న్ రాజా చెప్పాడు.

ఇక చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్న అనుభ‌వం గురించి మోహ‌న్ రాజా మాట్లాడుతూ.. 25 ఏళ్ల కింద‌ట త‌న తండ్రి ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన హిట్ల‌ర్ సినిమా త‌మ కుటుంబానికి ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని గొప్ప అనుభ‌వం అని.. ఒక అభిమానిగా ఆ సినిమా సాధించిన విజ‌యాన్ని ఆస్వాదించాని.. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు చిరును డైరెక్ట్ చేసే గొప్ప అవ‌కాశం త‌న‌కు ద‌క్కింద‌ని.. త‌న అత్యుత్త‌మ ప‌నితీరుతో దీనికి న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని మోహ‌న్ రాజా అన్నాడు. గాడ్‌ఫాద‌ర్‌ తొలి షెడ్యూల్లో ఒక ఫైట్ చిత్రీక‌రించామ‌ని, అది అదిరిపోయేలా వ‌చ్చిందని.. రెండు రోజుల గ్యాప్ త‌ర్వాత కొత్త షెడ్యూల్ మొద‌లుపెడ‌తామ‌ని మోహ‌న్ తెలిపాడు.