దేశమంతా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న భారీ చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్పటికే రెండు రిలీజ్ డేట్లు మారాయి. 2020 జులై 30న, 2021 జనవరి 21న అంటూ రెండుసార్లు డేట్లు ఇచ్చి తర్వాత అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్ తాకిడిని కూడా తట్టుకుని ఈ అక్టోబరు 13న సినిమాను రిలీజ్ చేయాలని ఎంతో పట్టుదలతో ప్రయత్నించారు కానీ.. అది సాధ్యపడేలా లేదు. సినిమాను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదని చిత్ర బృందం ఓ అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఐతే మూడోసారి సినిమాను వాయిదా వేస్తున్న నేపథ్యంలో ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా.. చిత్ర బృందంలోని ముఖ్యులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆరంభ దశలోనే రాజమౌళి అండ్ కో ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ, పాత్రల గురించే కాక పలు విశేషాలను పంచుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు సినిమా స్టేటస్ ఏంటో వెల్లడించడంతో పాటు తమ చిత్రాన్ని మరోసారి ఎందుకు వాయిదా వేయాల్సి వస్తోందో ఈ ప్రెస్ మీట్లో వివరించబోతున్నారట. అలాగే మరికొన్ని విశేషాలనూ పంచుకోనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రెస్ మీట్ గురించి మీడియాకు సమాచారం అందించనున్నారట. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి దేశమంతో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
ఈ సినిమా రిలీజ్‌ను బట్టే వివిధ భాషల్లో మిగతా చిత్రాల డేట్లు ఖరారవుతాయి. షెడ్యూళ్లు అటు ఇటు అవుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే తమ సినిమా విడుదలపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలని, అలాగే ప్రేక్షకులకు సర్దిచెప్పడం కూడా తమ బాధ్యత అని భావిస్తున్నారని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ఈ ప్రెస్ మీట్లోనే ప్రకటిస్తారని.. ఆ డేట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ కావడం పక్కా అని అంటున్నారు.