తెలుగు సినిమా చరిత్రలో రావు గోపాలరావుది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన విలనీ పండించే తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనదైన వెటకారం జోడించి విలన్ పాత్రలను ఆయన పండించే తీరు కట్టి పడేస్తుంది. ఒకే తరహా పాత్రలు పదుల సంఖ్యలో చేసినా మొనాటనీ రానివ్వకుండా తన నటనతో వాటికి ప్రత్యేకత తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. ఐతే ఆయన బతికుండగా తన కొడుకును సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నమే చేయలేదు. ఆయనకు రావు రమేష్ అనే కొడుకున్న సంగతి కూడా చాలామందికి తెలియదు.
ఐతే తండ్రి మరణించాక పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత తన కష్టంతో నటుడిగా ఎదిగాడు రావు రమేష్. ముందు చిన్న చిన్న పాత్రలే చేసినా.. ఆ తర్వాత ఆయన నట విలక్షణతను చాటుకుని నటుడిగా గొప్ప స్థాయిని అందుకున్నారు. తండ్రికి ఏమాత్రం తీసిపోని నటుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు రావు రమేష్‌ను గొప్ప గొప్ప పాత్రలు వెతుక్కుని వస్తున్నాయి.
తాజాగా రావు రమేష్ చెలరేగిపోవడానికి ఛాన్సున్న ఒక పాత్ర ఆయన తలుపు తట్టింది. మలయాళంలో సంచలనం రేపిన ‘నాయట్టు’ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో హైలైట్‌గా నిలిచిన జోజు జార్జ్ చేసిన సీనియర్ పోలీస్ పాత్రను తెలుగులో రావు రమేష్ చేయనున్నారట. ఈ పాత్ర కోసం ఆయన రికార్డు స్థాయిలో కోటిన్నర పారితోషకం తీసుకుంటున్న వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. పారితోషకం సంగతలా ఉంచితే.. జోజు పాత్ర ఒరిజినల్లో ఎంతో హృద్యంగా సాగుతుంది.
మొదట్లో మామూలుగానే అనిపించే ఆ క్యారెక్టర్ ముందుకు సాగేకొద్దీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. చివరికొచ్చేసరికి హృదయాలను బరువెక్కిస్తుంది. ఆ పాత్ర తాలూకు ట్విస్ట్ ప్రేక్షకులకు పెద్ద షాకే. సినిమా చూశాక చాన్నాళ్లు వెంటాడే పాత్ర ఇది. జోజు గొప్పగా నటించిన ఈ పాత్రను రావు రమేష్ ఇంకా ఇంప్రొవైజ్ చేసే ఛాన్సుంది. ఇంటెన్సిటీ చూపించడంలో, ఎమోషన్లు పండించడంలో రావు రమేష్ శైలే వేరు. ఒరిజినల్ చూసిన వాళ్లు ఈ పాత్ర రావు రమేష్ చేస్తున్నాడనగానే ఎగ్జైట్ అవుతారనడంలో సందేహం లేదు. రావు రమేష్ అంచనాలకు తగ్గట్లు చేస్తే ఈ పాత్ర ఆయన కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోవడం ఖాయం.