అయ్యప్పనుం కోషీయుం.. గత ఏడాది మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమా. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో విడుదలై ఈ చిత్రం కేరళలో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. వివిధ భాషల వాళ్లు విరగబడి చూశారు. సరిగ్గా కరోనా మొదలైన సమయంలోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో అన్ని భాషల వాళ్లూ దీన్ని ఆదరించారు.
అందులోనూ తెలుగులో పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనగానే ఇంకా ఎక్కువమంది చూశారు. అలా చూసిన వాళ్లందరికీ ఇది పక్కా మల్టీస్టారర్ అనే స్పష్టత ఉంది. హీరోలిద్దరికీ కూడా ఇందులో సమ ప్రాధాన్యం ఉంటుంది.
కాకపోతే బిజు మీనన్ చేసిన పాత్ర ఎక్కువ పవర్‌ఫుల్‌గా, ఆసక్తికరంగా కనిపిస్తుంది. అలాగని పృథ్వీరాజ్ క్యారెక్టర్ తక్కువగా కనిపించదు. అందుకే సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘అయ్యప్పనుం కోషీయుం’ అని పేరు పెట్టారు.
ఐతే తెలుగులోకి వచ్చేసరికి ఈ మల్టీస్లారర్ కాస్తా సోలో హీరో సినిమాలా మారిపోతుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు నుంచి ఈ సినిమా ప్రోమోల్లో ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ మీదే ఉండగా.. ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ల్లోనూ అంతా పవనే కనిపించాడు. ‘భీమ్లా నాయక్’ అని పవన్ పాత్ర పేరును టైటిల్‌గా పెట్టడంతో ఇది సోలో హీరో సినిమా అయిపోయింది. ఫస్ట్ గ్లింప్స్‌లోనూ ఆ పాత్ర మీదే ఫోకస్ చేశారు. అసలు రానా విజువలే వేయలేదు.
పవన్ పుట్టిన రోజు నాడు ఇలాంటి టీజర్ వదిలి ఉంటే వేరు కానీ.. ఇప్పుడిలా పవన్ మీదే పూర్తిగా ఫోకస్ పెట్టడంతో తెలుగులో పవన్ పాత్ర చుట్టూనే కథ నడపబోతున్నారేమో, రానా క్యారెక్టర్ని తగ్గించేశారేమో అనిపిస్తోంది. రానాను సైడ్ క్యారెక్టర్‌గా చేసేసినట్లున్నారని అతడి ఫ్యాన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం లేవనెత్తితే అప్పుడే ఓ కంక్లూజన్‌కు రావద్దంటూ నిర్మాత సూర్య నాగదేవర సూర్యవంశీ ఒక ట్వీట్ వేయడం గమనార్హం.