వెంకీ వెబ్ డెబ్యూ‌ని కన్ఫమ్ చేసిన అన్నయ్య

కరోనా పుణ్యమా అని ఇండియాలో వెబ్ సిరీస్‌ల మేకింగ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్లో ముందు నుంచే పెద్ద పెద్ద స్టార్లు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుండగా.. ఇప్పుడా ఒరవడి ఇంకా పెరిగింది. అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి బడా హీరోలు డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయారు. ఇక తెలుగు స్టార్లు కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన రోజులు వచ్చేశాయి.

అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్లు డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకరి గురించి స్పష్టత వచ్చేసింది. వెంకీ డిజిటల్ అరంగేట్రాన్ని ఆయన సోదరుడు దగ్గుబాటి వెంకటేష్ ఖరారు చేశారు. వెంకీ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో తన కొడుకు రానా దగ్గుబాటి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని చెప్పారాయన.

నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో సురేష్ ప్రొడక్షన్సే ఈ సిరీస్‌ను నిర్మించబోతుండటం విశేషం. ప్రధానంగా హిందీలో తెరకెక్కే ఈ సిరీస్‌ను పాన్ ఇండియా లెవెల్లో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తారట. వెంకీ 90వ దశకంలో కొన్ని హిందీ సినిమాలు చేశాడు. ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ వైపు చూడలేదు. దమ్ మారో దమ్, డిపార్ట్‌మెంట్, బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాలతో రానాకు హిందీలో మంచి గుర్తింపే ఉంది.

అతడి సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజవుతున్నాయి. హిందీలో సిరీస్ కాబట్టి బాలీవుడ్ నుంచి పేరున్న ఆర్టిస్టులను తీసుకునే అవకాశముంది. కాబట్టి ఈ సిరీస్‌కు మంచి క్రేజే రావచ్చు. మరి వెండితెరపై ఇప్పటిదాకా కలిసి నటించని వెంకీ-రానా ఇలా బుల్లితెర కోసం జట్టు కడుతుండటం విశేషమే. బహుశా ఈ ఇద్దరూ కలిసి ఓ థ్రిల్లర్ సిరీస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి.