టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ కేక‌

త‌మ సినిమాలు విడుద‌ల‌య్యే ముందు అంద‌రూ గొప్ప‌లు చెప్పుకునేవాళ్లే. కొంద‌రైతే మ‌రీ మ‌రీ శ్రుతి మించిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. దాని వ‌ల్ల కొన్నిసార్లు మంచి జ‌రుగుతుంది, కొన్నిసార్లు చెడు జ‌రుగుతుంది.

ముందు నుంచి స్టేజ్‌ల మీద చాలా అగ్రెసివ్‌గా మాట్లాడ్డం అల‌వాటైన‌ యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్సేన్.. త‌న కొత్త చిత్రం పాగ‌ల్ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు సంచ‌ల‌నం రేపాయి. ఈ సినిమాతో మూసుకున్న థియేట‌ర్లు కూడా తెరిపించేస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా అంటూ అత‌ను ఇచ్చిన స్టేట్మెంట్ చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఇంకా సినిమా గురించి ఓ రేంజిలో చెప్పుకుంటూ పోయాడు విశ్వ‌క్. ఐతే శ‌నివారం థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ విశ్వ‌క్ కామెంట్స్ చాలా అతిగానే అనిపించాయి. ఫ‌స్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు, విశ్వ‌క్ పెర్ఫామెన్స్ వ‌ర‌కు ఓకే కానీ.. అంత‌కుమించి సినిమాలో ఏమంత విష‌యం లేదు. సీరియ‌స్‌గా క‌థ‌లోకి దిగిన ద‌గ్గ‌ర్నుంచి సినిమా గాడి త‌ప్పింది. దీంతో విశ్వ‌క్ చెప్పిందేంటి.. సినిమాలో ఉన్న‌దేంటి అంటూ నెటిజ‌న్లు రివ‌ర్స్‌లో అత‌ణ్ని ఆడుకోవ‌డం మొద‌లుపెట్టారు. మ‌ధ్యాహ్నం నుంచి విశ్వ‌క్ బాగా ట్రోల్ అవుతున్నాడు.

ఐతే ఇలా ట్రోల్ అయితే అయ్యాడు కానీ.. ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్ల‌తో అత‌డి ల‌క్ష్యం మాత్రం నెర‌వేరింది. పాగ‌ల్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ అంచ‌నాల‌కు మించి జ‌రిగాయి. శ‌నివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు ఫుల్స్ ప‌డ్డాయి. చాలా చోట్ల మార్నింగ్ షోల‌కు టికెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి క‌నిపించింది. ఇప్పుడు డివైడ్ టాక్ వ‌ల్ల వీకెండ్ త‌ర్వాత సినిమా ప‌రిస్థితి క‌ష్ట‌మే కావ‌చ్చు కానీ.. వారాంతం వ‌ర‌కు ఈ సినిమా అంచ‌నాల‌ను మించి వ‌సూళ్లు రాబ‌ట్టి నిర్మాత‌లు, బ‌య్య‌ర్ల‌ను బ‌య‌ట‌ప‌డేసేలాగే క‌నిపిస్తోంది.