జబర్దస్త్ షోలో కళ్లు చెదిరే గ్లామర్‌తో తెలుగు యాంకరింగ్ ట్రెండునే మార్చేసిన భామ అనసూయ భరద్వాజ్. అప్పటిదాకా యాంకర్లంటే ట్రెడిషనల్‌గా కనిపించేవారు కానీ.. అనసూయ హవా మొదలయ్యాక అందరూ చాలామంది గ్లామర్ రూట్లోకి వచ్చేశారు.
జబర్దస్త్‌తో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలు అందుకుని దూసుకెళ్తోంది అనసూయ. ఆమెకు నటిగా చాలా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అంటే.. రంగస్థలం అనే చెప్పాలి. అందులో రంగమ్మత్తగా అనసూయ నటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆమెలో ఇంత మంచి నటి ఉందా అనిపించిందా సినిమా. రంగస్థలంలో అనసూయ గెటప్ కూడా చాలా చక్కగా కుదిరింది. ఈ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కే ఇవ్వాలి. ఇప్పుడు అనసూయకు ఆయన మరో మంచి పాత్ర ఇచ్చినట్లే కనిపిస్తోంది.
సుక్కు కొత్త చిత్రం పుష్పలోనూ అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెది ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటున్నారు. చిత్తూరు వేష భాషలతో సాగే ఈ పాత్ర అనసూయకు కొత్తగా ఉంటుందనడంలో సందేహం లేదు.ఈ పాత్రలో అనసూయ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని సంకేతాలు వస్తున్నాయి. తాజాగా అనసూయ ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తక్కువ జుట్టుతో హెవీ మేకప్‌తో, పెద్ద బొట్టుతో చిత్రంగా కనిపిస్తోంది అనసూయ. మొత్తంగా ఆమె గెటప్ జిగేల్జిగేల్మనిపించేలా ఉంది.
పుష్ప కొన్ని దశాబ్దాల వెనుకటి నేపథ్యంలో నడిచే కథ. అప్పట్లో చిత్తూరులో కొంచెం ఢాంబికంతో ఉండే లేడీస్‌ను బాగా స్టడీ చేసి ఈ పాత్రను డిజైన్ చేసినట్లున్నాడు సుక్కు. గెటప్ చూస్తే ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ పాత్ర.. సినిమాలో ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ పాత్ర కూడా క్లిక్ అయితే అనసూయ కెరీర్ మరో మలుపు తిరిగినట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates