కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత పున:ప్రారంభం అయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లలోకి త్వరలోనే ఇంకా పేరున్న సినిమా దిగబోతోంది. ఇంకో నాలుగు రోజుల్లోనే విశ్వక్సేన్ సినిమా ‘పాగల్’ రిలీజ్ కానుంది. రెండు రోజుల ముందే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తర్వాత రెండు వారాల్లో చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
‘పాగల్’ వాటితో పోలిస్తే కాస్త పెద్దదే. ఈ స్థాయి క్రేజున్న సినిమా ఇప్పటిదాకా రాలేదు. గత వారం వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కాస్త యూత్ దృష్టిని ఆకర్షించగా.. ఈ చిత్రంతో మరింతగా యువత ప్రేక్షకులు థియేటర్లకు కదులుతారని అనిపిస్తోంది. విశ్వక్సేన్కు యూత్‌లో ఉన్న క్రేజ్‌కు తోడు.. ‘పాగల్’ ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లా కనిపిస్తుండటమే అందుక్కారణం. ఈ రోజే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. ఇందులో విశ్వక్ ప్లేబాయ్ తరహా పాత్రను పోషిస్తుండటం విశేషం.
కనిపించిన ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెప్పి వెంట తిరగే టైపు క్యారెక్టర్ విశ్వక్‌ది. అలా అతను ఐలవ్యూ చెప్పిన అమ్మాయిల సంఖ్య ఏకంగా 1600 అట. అంటే అమ్మాయి కనిపిస్తే చాలు.. ఐలవ్యూ చెప్పడమే అనమాట. ఒక రోజు ఉదయం 6 గంటలకే వచ్చి అమ్మాయిల కోసం వెతుకుతుంటే.. ఈ టైంలో స్వీపర్స్ తప్ప ఎవరూ ఉండరు వాళ్లకు చెప్పు ఐలవ్యూ అని ఫ్రెండు అంటే.. వాళ్లు ఒప్పుకుంటారా అని అడిగే టైపు హీరో. ఈ క్రమంలోనే ఒక లావుపాటి అమ్మాయికి ఐలవ్యూ చెప్పేస్తాడు. ఐతే ఇలా నాన్ సీరియస్‌గా ఉన్న వ్యక్తి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది.
ఆ అమ్మాయి అదో టైపు. తన ప్రేమలో హీరో పడతాడు. అప్పటిదాకా అమ్మాయిలకు హీరో ఐలవ్యూ మాత్రమే చెప్పాడు. వాళ్లను లవ్ చేయలేదు. ఈ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తాడు. కానీ తను అతణ్ని విడిచి దూరంగా వెళ్లిపోతుంది. అప్పుడు అతను పడే బాధ.. ఆ తర్వాత అమ్మాయిని దక్కించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం. టీజర్ చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్, లవ్ ఫీల్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రంతో కుప్పిలి నరేష్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నివేథా పెతురాజ్ విశ్వక్‌కు జోడీగా నటించింది.