‘సలార్’లో సీనియర్ నటుడు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతిహాసన్ కూడా జాయిన్ అయింది. సెట్ లో ప్రభాస్ ఇంటి భోజనంతో ట్రీట్ ఇచ్చినట్లు శృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది.

ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల నుండి పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబుని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన్ను ఇదివరకే సంప్రదించారట. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. తాజా షెడ్యూల్ లో జగపతిబాబు కూడా పాల్గొనడంతో విషయం బయటకొచ్చింది. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.

ఇక విలన్ రోల్ కోసం మరో పాపులర్ నటుడిని ఆన్ బోర్డ్ చేయబోతున్నారు. అలానే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను సంప్రదిస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీమ్ మొత్తం ‘సలార్’ సినిమాకి కూడా పని చేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.