అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ ఫిర్యాదు!

ఓటీటీలో వచ్చే కంటెంట్ శృతిమించుతుందని దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ పై ఫిర్యాదు నమోదైంది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఆంథాలజీ షార్ట్ ఫిల్మ్ గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇందులో నటి శోభితా ధూళిపాళ నటించింది. అయితే ఓ సీన్ అవసరం లేకపోయినా.. డైరెక్టర్ తీశారంటూ శోభితా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఓ సీన్ లో నటి శోభితా పాత్రకు గర్భస్రావం అందుతుంది. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ చనిపోయిన బిడ్డను చేతిలో పట్టుకొని కూర్చుంటుంది. నిజానికి ఆ సీన్ కథకు అవసరం లేదని.. అయినా మేకర్లు సీన్ తీశారని.. దాని వలన మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపినట్లు అవుతుందని జూలై 27న నమోదైన ఫిర్యాదులో శోభితా పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తారా..? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన రూల్స్ లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకు తెలియజేసినట్లు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్ ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బ తీయడం ఇలా వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీదైనా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్ ను హెచ్చరించింది. గతంలో ‘సేక్రెడ్ గేమ్స్’, ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్ ల కారణంగా నెట్ ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచింది.