బాలీవుడ్లో మ‌రో రీమేక్.. కౌంట‌ర్లే కౌంట‌ర్లు


బాలీవుడ్లో క‌థ‌ల‌కు బాగా క‌ర‌వొచ్చేసిన‌ట్లుంది. ద‌క్షిణాదిన ఏ భాష‌లో ఏ సినిమా హిట్ట‌యినా స‌రే.. ప‌ట్టుకొచ్చి రీమేక్ చేసి ప‌డేస్తున్నారు. కొత్త సినిమాల‌నే కాదు.. కొన్నేళ్ల కింద‌ట వ‌చ్చిన పాత సినిమాల‌ను సైతం వ‌ద‌ల‌ట్లేదు. వెతికి వెతికి సినిమాలు ఎంచుకుని రీమేక్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్లో సెట్స్ మీద ఉన్న రీమేక్‌లు రెండంకెల సంఖ్య‌లోనే ఉన్నాయి.

తెలుగు నుంచి జెర్సీ, ఎఫ్‌-2, హిట్, క్రాక్, నాంది త‌దిత‌ర చిత్రాలు రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌మిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన మ‌రో సినిమాను హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారు. అదే.. రెడ్. ఈ చిత్రం త‌మిళ హిట్ త‌డ‌మ్‌కు రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో అరుణ్ విజ‌య్ న‌టించిన ఈ సినిమా అక్క‌డ సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. తెలుగులో కూడా ఓ మోస్త‌రుగానే ఆడింది.

ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో సిద్దార్థ్ రాయ్ క‌పూర్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్నట్లు ప్ర‌క‌టించారు. మృణాల్ క‌పూర్ క‌థానాయిక అట‌. వ‌ర్ధ‌న్ ఖేత్క‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో ప్ర‌ముఖ నిర్మాత‌లు భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌బోతున్నారు. ఐతే ఈ రీమేక్ గురించి ప్ర‌క‌ట‌న రాగానే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. సౌత్‌లో వ‌చ్చిన ఏ సినిమానూ వ‌ద‌ల‌రా అని.. బాలీవుడ్ పేరును రీమేక్‌వుడ్ అని మార్చుకోవాల‌ని విమ‌ర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు హిందీ అభిమానులు.

ఇక త‌మిళ అభిమానులేమో.. అరుణ్ విజ‌య్ అద‌ర‌గొట్టిన పాత్ర‌లో సిద్దార్థ్ రాయ్ క‌పూర్ లాంటి యావ‌రేజ్ యాక్ట‌ర్ ఏం ఫిట్ అవుతాడ‌ని.. ఈ రీమేక్‌ను చెడ‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని కౌంట‌ర్లు వేస్తున్నారు. ఐతే సౌత్ నుంచి హిట్ సినిమాల‌ను ఎంచుకుని.. వాటికి బాలీవుడ్ ట‌చ్ ఇచ్చి హిట్టు కొట్ట‌డం అక్క‌డ కామ‌న్ అయిపోయింది. త‌డ‌మ్ విష‌యంలోనూ అదే ప‌ద్ధ‌తి ఫాలో కానున్నారేమో.