ఒకే తెరపై మెగా-అక్కినేని హీరోలు!

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చేవి. ఆ తరువాత అలాంటి కథలు రావడం తగ్గిపోయాయి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హీరోలుగా ఆధిపత్యం చెలాయించిన సమయంలో మల్టీస్టారర్ కథలు రాలేదు. నిజానికి అలాంటి కథలను దర్శకులు రెడీ చేసుకున్నా.. ఎందుకో వర్కవుట్ కాలేదు. దర్శకుడు మణిరత్నం తీసిన ‘ఘర్షణ’ కథ ముందుగా వెంకీ-నాగార్జులకు వినిపించారు.

కానీ కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు హీరోలు కథను రిజెక్ట్ చేశారు. ఆ తరువాత ప్రభు-కార్తీక్ లను హీరోలుగా పెట్టి సూపర్ హిట్ కొట్టారు మణిరత్నం. ఇక చిరంజీవి-నాగార్జున చాలా ఏళ్లుగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నారు. కానీ కథ దొరకడం లేదు. వీరి తరంలో సెట్ కానీ మల్టీస్టారర్లను ఈ తరం హీరోలు వర్కవుట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి. త్వరలోనే మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ ను చూడబోతున్నాం. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కథ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ ఓ కథ విన్నారట. అందులో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. ముందుగా ఇద్దరు మెగా హీరోలతో సినిమా అనుకున్నారు కానీ సాయి ధరమ్ తేజ్.. నాగచైతన్య, అఖిల్ లలో ఎవరైనా చేస్తే బాగుటుందని సూచించారట. ఇప్పుడు కథ అక్కినేని బ్రదర్స్ దగ్గరకు వెళ్లిందని సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.