నిఖిల్ కొత్త టైటిల్.. ‘దైవం మనుష్య రూపేణా’!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

ఇటీవలే ’18 పేజెస్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ సీక్వెల్ లో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇంతకాలానికి ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతోంది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే పునః ప్రారంభించారు. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ ‘కార్తికేయ 2’. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

‘దైవం మనుష్య రూపేణా’ అనే టైటిల్ ను సినిమాకి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. నిఖిల్ కి కూడా టైటిల్ బాగా నచ్చిందట. కథ ప్రకారం ఈ సినిమాను ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆగస్టు నుండి యూరప్, వియాత్నం వంటి దేశాల్లో చిత్రీకరించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.