సినీ పెద్దల వినతిపై సీఎం సానుకూలత

కరోనాతో అత్యంత ఎక్కువ నష్టపోయిన, అతి ఎక్కువగా దెబ్బ తిన్న రంగం ఏదైనా ఉందంటే… అది కచ్చితంగా సినిమా రంగమే. దీని విషయంలో ఎవరికీ దయ లేదు. గవర్నమెంట్లకు ఇది లీస్ట్ ప్రయారిటీ.

అయితే… ఈరోజు సినీ రంగ ప్రముఖులందరూ తమ భవిష్యత్తుపై చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, జెమిని కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు హాజరయ్యారు.

లక్షల మంది జీవితాలు ఆధారపడిన రంగం అని… కొన్ని మార్గదర్శకాలతో దీనికి అనుమతి ఇవ్వాలనేది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ముందు పెట్టిన వినతి. థియేటర్లు ఆలస్యం చేసినా… సినిమా షూటింగులు, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ క్రమంలో సినిమా నిర్మాణ తీరు, తీసుకునే జాగ్రత్తల గురించి ముఖ్యమంత్రికి వీరు వివరించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చలో సినీ ప్రముఖుల వినతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

సినిమా షూటింగులు, ఇతర పనులకు దశల వారీగా అనుమతి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఆయా సినిమా విభాగాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా షూటింగుల్లో భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ అయినందున తక్కువ మందితో, ఇన్ డోర్‌లో చేసే వీలున్న ప్రొడక్షన్ పనులు తొలుత మొదలుపెట్టడానికి ముఖ్యమంత్రి సుముఖత తెలిపారు. పరిస్థితులను అంచనా వేసి జూన్ మాసంలో సినిమా షూటింగులకు అనుమతి ఇస్తామని చెప్పారు. సినిమా థియేటర్ల తెరవడం గురించి తదుపరి సమాచారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి తెలిపారు.

షూటింగుల్లో పాల్గొనే వారి సంఖ్య, జాగ్రత్తలు వంటి విషయాల గురించి మరొకసారి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులకు ముఖ్యమంత్రి సూచించారు. కేసులను బట్టి, పరిస్థితులను ఎప్పటికపుడు నిబంధనలు మార్చే అవకాశమూ లేకపోలేదన్నారు.