నా పేరు చెప్పి మోసం.. రైటర్ ఆగ్రహం

Lakshmi-Bhupal

టాలీవుడ్లో మంచి కలం బలం ఉన్న రచయితల్లో లక్ష్మీ భూపాల ఒకరు. చందమామ, అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆయన తన పెన్ పవర్ చూపించారు. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న చిత్రాలకు లక్ష్మీ భూపాల రైటింగ్ బాగా సూటవుతుందన్న పేరుంది. ప్రస్తుతం ఆయన నందిని రెడ్డి కొత్త చిత్రానికి పని చేస్తున్నారు.

చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. ఐతే లక్ష్మీ భూపాల పేరు వాడుకుని కొందరు ఇండస్ట్రీలో మోసాలకు పాల్పడుతుండటం ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన దగ్గర పని చేశామని చెబుతూ.. అవకాశాలు అందుకోవడం, డబ్బులు దండుకోవడం గురించి తెలిసి ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టారు లక్ష్మీభూపాల.

తన దగ్గర ఇప్పటిదాకా ఎవ్వరూ రచయితలుగా పని చేయలేదని, తనకు అలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదని.. తాను కేవలం తన సామర్థ్యాన్ని నమ్ముకుని పని చేస్తున్నానని లక్ష్మీ భూపాల వ్యాఖ్యానించాడు. నాకు బ్రాంచీలు లేవు.. నా కేరాఫ్ అడ్రస్ నేనే.. అంటూ తన శైలిలో వ్యాఖ్యలు చేశారాయన.

“నా దగ్గర అసిస్టెంట్‌ రచయితగా పనిచేశానని, నాకే తెలీకుండా నా దగ్గర ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశానని ఈ మధ్య కొందరు మార్కెట్లో ఏ మాత్రం సిగ్గులేకుండా నా పేరు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు తెలిసింది. నా అసిస్టెంట్‌ అని చెప్పుకుంటూ కొందరు కొన్నిచోట్ల అడ్వాన్స్‌ తీసుకున్నారని తెలిసింది. నేను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటివరకు నా బుర్రని తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు, నాకు ఒక్క అసిస్టెంట్‌ కూడా లేడు. ఇకముందు కూడా ఆ అవసరం లేదు.. ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, నా బుర్రని నమ్మి డబ్బులిస్తారని నమ్ముతాను కాబట్టి.. అసిస్టెంట్లను పెట్టుకునే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయంలో నేను మాట్లాడలేను. దర్శక నిర్మాతల్లారా దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి ఎందుకంటే… నా కేరాఫ్‌ నేను మాత్రమే.. నాకెక్కడా బ్రాంచీల్లేవ్‌” అని లక్ష్మీభూపాల తన పోస్టులో పేర్కొన్నారు.