‘ల‌వ్ స్టోరి’కి ప‌ది ఆఫ‌ర్లు వ‌చ్చినా..

భారీ చిత్రాల‌ను ప‌క్క‌న పెట్టేస్తే ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో లవ్ స్టోరి ఒక‌టి. ఫిదా త‌ర్వాత శేఖర్ క‌మ్ముల చేస్తున్న సినిమా కావ‌డంతో ముందే ఈ చిత్రంపై మంచి అంచ‌నాలుండ‌గా.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జోడీ ఆక‌ర్ష‌ణ కూడా తోడైంది. పైగా ఈ సినిమా పాట‌లు, ఇత‌ర ప్రోమోలు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా చూడ్డం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. కానీ ఏప్రిల్లో ఇంకో వారంలో సినిమా రిలీజ్ అన‌గా క‌రోనా ఉద్ధృతి పెరిగి విడుద‌ల వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

ఐతే మ‌ధ్య‌లో ఓటీటీల నుంచి ల‌వ్ స్టోరి కోసం ఆఫ‌ర్లు వచ్చినా నిర్మాత‌లు చ‌లించ‌లేద‌ని వార్త‌లొచ్చిన సంగతి తెలిసిందే. నైజాంలో మెజారిటీ థియేట‌ర్లు చేతిలో ఉన్న ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డం తెలిసిందే.

తాజాగా నారంగ్ ల‌వ్ స్టోరి ఓటీటీ ఆఫ‌ర్ల గురించి స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా ప‌ది ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఐతే త‌మ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌న్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు.

నైజాంలో టాప్ ఎగ్జిబిటర్ అయిన నారంగ్.. ఓటీటీల్లో కొత్త చిత్రాలను రిలీజ్ చేసే నిర్మాతల తీరును తీవ్రంగా తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా మారినప్పటికీ ఎగ్జిబిటర్ల వైపే ఆయన నిలుస్తున్నారు. సినిమాకు వెన్నెముక థియేటర్లే అని.. ఆ ఇండస్ట్రీ కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తిన్న నేపథ్యంలో వాటి పునరుజ్జీవం కోసం నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా కాస్త ఆగాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘లవ్ స్టోరి’ ఓటీటీ రిలీజ్ కోసం తమకు క్రేజీ ఆఫర్లు వచ్చినా చలించలేదని, ఇలాగే మిగతా నిర్మాతలూ ఆలోచించాలని నారంగ్ అభిప్రాయపడుతున్నారు.