టాలీవుడ్ స్టార్స్.. ఇక దంచుడే

మొత్తానికి టాలీవుడ్‌కు మ‌ళ్లీ కళ వ‌చ్చేసిన‌ట్లే. ఇక ఎటు చూసినా షూటింగ్‌లే షూటింగ్‌లు. ఇక కార్మికులెవ‌రూ ఖాళీగా ఉండాల్సిన ప‌ని లేదు. ఏ చిత్ర బృందానికీ ఎదురు చూపులు లేవు. క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి త‌గ్గి.. తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తేయ‌గానే ఒక్కో చిత్ర బృందం చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లిపోతోంది. కొన్ని భారీ చిత్రాల బృందాలు మాత్రం రంగంలోకి దిగ‌డానికి టైం తీసుకున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల కాల్ షీట్లు చూసుకుని.. షూటింగ్‌కు ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేసుకుని ప‌ని మొద‌లుపెట్టాల్సి రావ‌డ‌మే అందుక్కార‌ణం.

ఇందుకోసం రెండుమూడు వారాలు కేటాయించిన టీమ్స్.. ఒక్కొక్క‌టిగా ప‌నిలోకి దిగేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ టీం గ‌త నెల‌లోనే షూటింగ్ పునఃప్రారంభించ‌గా.. తార‌క్, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. తాజాగా అల్లు అర్జున్‌-సుకుమార్‌ల పుష్ప సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొద‌లైపోయింది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య కొత్త షెడ్యూల్‌ను బుధ‌వార‌మే మొద‌లుపెడుతుండ‌టం విశేషం. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత షూటింగ్ పునఃప్రారంభించ‌డానికి బాగా టైం తీసుకున్న చిరు.. ఈసారి మాత్రం తొంద‌ర‌ప‌డుతున్నాడు. ఇంకో రెండు వారాల చిత్రీక‌ర‌ణ జ‌రిపితే ఈ సినిమా పూర్త‌యిపోతుంది. చ‌ర‌ణ్ కూడా ఒక వారం షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబులిద్ద‌రూ ఒకే రోజు షూటింగ్ పునఃప్రారంభించ‌నుండ‌టం విశేషం. ఈ నెల 12న వీరి చిత్రాలు అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేక్, స‌ర్కారు వారి పాట తిరిగి సెట్స్ మీదికి వెళ్ల‌నున్నాయి.

బాల‌య్య‌, వెంక‌టేష్‌, ర‌వితేజ ఇప్ప‌టికే తమ చిత్రాల‌ను తిరిగి మొద‌లుపెట్టారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్లో అంద‌రు స్టార్లూ తిరిగి బిజీ అయిపోతున్నారు. మూడో వేవ్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో మళ్లీ ఎక్కడ బ్రేక్ పడుతుందో అని.. వాళ్లంద‌రూ నాన్ స్టాప్‌గా షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.