‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు నటించబోయే కొత్త సినిమా ఏదనే విషయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పరశురామ్‌తో సినిమా దాదాపు ఖరారైనప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రతి ఏడాదీ తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న ఏదో ఒక విశేషాన్ని అభిమానులతో పంచుకోవడం అలవాటైన మహేష్.. ఈ సారి ఆ రోజున తన కొత్త చిత్రం ప్రకటన చేస్తాడని వార్తలొచ్చాయి.
మహేష్ పీఆర్వో టీం కూడా ఆ విషయాన్ని కొన్ని రోజుల కిందట మీడియా వాళ్లకు ధ్రువీకరించింది. సినిమా ప్రకటనతో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని వార్తలొచ్చాయి. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. కానీ వారి ఉత్సాహంపై నీళ్లు పడ్డట్లే అని తాజా సమాచారం.
తండ్రి పుట్టిన రోజుకు కొత్త సినిమా ప్రకటన చేయాలని మహేష్ అనుకున్నప్పటికీ అందుకు కృష్ణ అంగీకరించలేదట. తన భార్య విజయనిర్మల మరణానంతరం కృష్ణ తీవ్రమైన దు:ఖంలో ఉన్నారు. వచ్చే నెల 27న ఆమె సంవత్సరీకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడానికి ఆయన పూర్తి అయిష్టంగా ఉన్నారట. లాక్ డౌన్ కూడా నడుస్తున్న నేపథ్యంలో తన అభిమానులెవ్వరూ వేడుకలు చేయొద్దని కృష్ణ సందేశం పంపారట.
ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా ప్రకటనను కూడా మహేష్ వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం. షూటింగ్స్ పున:ప్రారంభమయ్యాక నేరుగా ముహూర్త కార్యక్రమంతో సినిమా గురించి ప్రకటన చేయాలని మహేష్ అండ్ టీం ఫిక్సయినట్లు సమాచారం. బహుశా ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు నాడు ఆ సినిమా మొదలవ్వడమో.. లేక ప్రకటన రావడమో జరగొచ్చేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates