పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాల క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాల దర్శకుడు సాగర్ చంద్ర రూపొందిస్తున్నాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్రను పవన్ చేస్తుండగా.. పృథ్వీరాజ్ పోషించిన కోషీ క్యారెక్టర్లో రానా కనిపించనున్నాడు.
ఈ సినిమాను ఏడాది కిందటే ప్రకటించినప్పటికీ.. సగం చిత్రీకరణ కూడా పూర్తి చేసినప్పటికీ ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఐతే ఎట్టకేలకు టైటిల్ ప్రకటనకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. పరశురామ కృష్ణమూర్తి అనే పేరును ఈ చిత్రానికి ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. మలయాళంలో మాదిరే ఇద్దరు ప్రధాన పాత్రధారుల పేర్ల ఆధారంగానే ఈ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఐతే ఇందులో పరశురామ్ ఎవరు కృష్ణమూర్తి ఎవరు అన్నదే తేలాల్సి ఉంది. పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. పైగా ఆయన రేంజ్ ఎక్కువ కాబట్టి ముందు ఆయన పేరు వచ్చేలా, పవర్ ఫుల్‌గా కూడా ఉండే పరశురామ్ పేరు ముందు పెట్టి ఉండొచ్చు. రానా పాత్ర పేరు కృష్ణమూర్తి అయి ఉండొచ్చు. కాకపోతే ఈ పేరు కొంచెం పాతగా అనిపిస్తోంది. 30 ప్లస్‌లో ఉన్న యువకుడికి ఈ పేరు అంతగా సూట్ కాకపోవచ్చు. అయినా చిత్ర బృందం ఓకే అనుకుని ఉండొచ్చు.
ఈ సినిమాకు సంబంధించి రచన బాధ్యత అంతా త్రివిక్రమ్‌దే. మార్పులు, మాటలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. బహుశా టైటిల్ కూడా ఆయనే పెట్టి ఉండొచ్చు. త్వరలోనే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్ కథానాయకలుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates