మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు వేడి రోజు రోజుకూ రాజుకుంటోంది. ఎన్నికలకు మూడు నెలల ముందే ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారం పది రోజులుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. మీడియాలోనూ సినిమా సంగతుల కంటే ఈ వ్యవహారంపైనే చర్చలు నడుస్తున్నాయి.
కొత్తగా ఎన్నికల బరిలో నిలుస్తున్న ప్రకాష్ రాజ్, ఆయనకు మద్దతు పలుకుతున్న నాగబాబు.. గత కార్యవర్గాలపై విమర్శలు చేయడం ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌కు తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి వాళ్లిద్దరి వ్యాఖ్యలను ఖండించిన నరేష్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలే చేశారు. నరేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
మా ఎన్నికలకు సంబంధించి కొందరు హిడెన్ అజెండాతో పని చేస్తున్నారని.. తాము చేసిన మంచి పనులను చెరిపేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించిన నరేష్.. మా లో చిచ్చు రేపాలని చూస్తున్న బిగ్ బాస్ ఎవరు? అంటూ ప్రశ్న సంధించడం విశేషం. బిగ్ బాస్ అనగానే అందరికీ చిరు గుర్తుకొస్తారు. పైగా ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. మరోవైపేమో దాసరి నారాయణరావు మరణాంతరం ఆయన లేని లోటు బాగా కనిపిస్తోందని.. ఆయన ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కూర్చుని సెటిల్ చేసేవారని.. ఇప్పుడలాంటి వారు లేరని.. దాసరి స్థానంలోకి ఎవరో ఒకరు రావాలని నరేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.
నిజానికి దాసరి తర్వాత ఆ స్థానంలో చిరు ఉన్నారని ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు భావిస్తున్నారు. చిరు కూడా పెద్ద మనిషి తరహాలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. కానీ నరేష్ ఆయన్ని అలా గుర్తిస్తున్నట్లుగా కనిపించడం లేదు. ప్రకాష్ రాజ్‌కు చిరు మద్దతుందని నాగబాబు అంటున్న నేపథ్యంలో నరేష్ పరోక్షంగా చిరును టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారేమో అన్న చర్చ టాలీవుడ్లో నడుస్తోంది.