తాప్సీపై కంగనా మళ్లీ..

బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకు పోటీగా తయారైన తాప్సి మీద కంగనా రనౌత్ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు తాప్సి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగనా. తాప్సి తనను కాపీ కొడుతుంటుందని.. తనలాగే కనిపించడానికి ప్రయత్నిస్తుందని.. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. ఇలా ఎన్నోసార్లు విమర్శలు చేసింది. తాప్సి చాలాసార్లు సంయమనం పాటిస్తుంటుంది కానీ.. కొన్ని సార్లు మాత్రం ఆమె కూడా నోటికి పని చెబుతుంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కంగనా గురించి అడిగితే చాలా మామూలుగానే జవాబిచ్చిందామె. కానీ అవతలి వాళ్లు సైలెంటుగా ఉన్నా కూడా కెలికే రకమైన కంగనా.. తన గురించి వేరే వాళ్లు కామెంట్ చేస్తే ఊరుకుంటుందా? ఎప్పట్లాగే రెచ్చిపోయి తాప్సి గురించి ఎలా పడితే అలా మాట్లాడేసింది. ఆమెను మరోసారి బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తేలిక చేసే ప్రయత్నం చేసింది.

కంగనా చేసిన అతితో ఆమె మీద ట్విట్టర్ బ్యాన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు పరిమితం అయింది. ఐతే ట్విట్టర్లో కంగనా లేకపోవడం లోటుగా ఉందా అని ఓ ఇంటర్వ్యూలో తాప్సీని అడిగితే.. అలాంటిదేమీ లేదని తేల్చేసింది. ఈ కామెంట్ మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టే పెట్టేసింది కంగనా. తాప్సి పేరెత్తకుండానే ఆమె మీద విమర్శలు గుప్పించింది. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. వేరే వాళ్లు వదిలేసిన పాత్రలను తనకివ్వమంటూ నిర్మాతల్ని ఆమె అడుక్కుంటూ ఉంటుందని వ్యాఖ్యానించింది.

తాప్సీని పేద నిర్మాతల పాలిట కంగనాగా చెప్పుకుంటూ ఉంటారని.. ఆమె తనను కాపీ కొడుతూ ఉంటుందని కూడా కంగనా ఎద్దేవా చేసింది. పాపం కంగనా లేని లోటును ఫీలవుతున్నారా అని అడిగితే లేదు అని చెప్పిన పాపానికి మరీ ఇంతలా తాప్సీని టార్గెట్ చేయాలా అంటూ నెటిజన్లు కంగనా ీమద మండిపడుతున్నారు. కానీ ఆమె ఇలాంటివన్నీ పట్టించుకునే రకమా?