పుష్ప‌.. ఇండియాలో నంబ‌ర్ వ‌న్

అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాపై మ‌న ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలిసిందే. ఐతే దేశంలోని ఇత‌ర భాష‌ల వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ ఇది. ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ఎప్ప‌టికప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల జాబితా ఇస్తుంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత మ‌ళ్లీ ఇండియాలో అన్ని ఫిలిం ఇండ‌స్ట్రీలూ రీస్టార్ట్ దిశ‌గా అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో ఈ ఏడాది రాబోయే చిత్రాల్లో వేటి కోసం అత్యంత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారా అని ఐఎండీబీలో చూస్తే.. ఈ జాబితాలో పుష్ప అగ్ర‌స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇండియా మొత్తంలో అత్య‌ధిక అంచ‌నాలున్న చిత్రం పుష్ప‌నే కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఈ చిత్రానికి 27 శాతానికి పైగా ప్రేక్ష‌కులలు అనుకూలంగా ఓటేయ‌డం విశేషం.

కేజీఎఫ్-చాప్ట‌ర్ 2 లాంటి క్రేజీ సినిమాను పుష్ప వెన‌క్కి నెట్టింది. కేజీఎఫ్‌-2కు అనుకూలంగా 18.5 శాతం ఓట్లు ప‌డ్డాయి. అది రెండో స్థానంలో ఉండ‌గా.. మ‌రి కొన్ని రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ కానున్న తాప్సి మూవీ హ‌సీన్ దిల్‌రుబా 12.9 శాతం ఓటింగ్‌తో మూడో స్థానం ద‌క్కించుకుంది. ఇక పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్ 8.5 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.

వ‌చ్చే నెల చివ‌ర్లో థియేట్రిక‌ల్ రిలీజ్‌కు రెడీ అయిన‌ అక్ష‌య్ కుమార్ సినిమా బెల్ బాట‌మ్ 6.2 శాతం ఓటింగ్‌తో అయిదో స్థానంలో కొన‌సాగుతోంది. తూఫాన్, ఆత్రంగి, మ‌ర‌క్కార్ గంగూబాయి క‌తియావాడి, ఫీల్స్ లైక్ ఇష్క్ వ‌రుస‌గా 6, 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌కు ఈ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. బహుశా ఈ చిత్రం ఈ ఏడాది విడుద‌ల కాద‌నే ఉద్దేశంతో దీనికి ఈ లిస్ట్‌లో చోటివ్వ‌లేదేమో.