చిరును లాగొద్దంటున్న ప్రకాష్ రాజ్


ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. ఇంతలోనే హడావుడి మొదలైపోయింది టాలీవుడ్లో. గత మూణ్నాలుగు రోజులుగా అటు టాలీవుడ్లో.. ఇటు మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడంతో ఈ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆయనకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించడంతో ఆసక్తి రెట్టింపైంది.

నాగబాబు సపోర్ట్ చేశాడంటే.. ఆటోమేటిగ్గా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్‌కే ఉంటుందని.. చిరు సపోర్ట్ చేశాడంటే ప్రకాష్ రాజ్ గెలుపు లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే తన మిత్రుడైన మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా అధ్యక్ష బరిలో నిలుస్తున్న నేపథ్యంలో చిరు.. ఓపెన్‌గా ఎవరికీ తన మద్దతు ప్రకటించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా చిరంజీవి మద్దతు గురించి మాట్లాడినపుడల్లా ప్రకాష్ రాజ్ మాట దాట వేస్తుండటం గమనార్హం. ఆయన మద్దతు తనకు ఉందని ఆయన అనట్లేదు. ముందుగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినపుడు.. చిరు ఎవరు మంచి చేస్తారనిపిస్తే వాళ్లకే మద్దతిస్తారంటూ వ్యాఖ్యానించాడు ప్రకాష్ రాజ్. తాజాగా తన ప్యానెల్‌ను ప్రకటిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్.. చిరు మద్దతు గురించి అడిగితే ఆసక్తికర రీతిలో స్పందించాడు. ‘మా’ ఎన్నికల వ్యవహారంలోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు. కేవలం 800 మంది సమూహం కోసం జరుగుతున్న ఎన్నికలివని.. దీన్ని పెద్దది చేసి చూడొద్దని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

మంచు విష్ణు కూడా బరిలో నిలిచే పరిస్థితిలో చిరు.. ప్రకాష్ రాజ్‌కు ఓపెన్ సపోర్ట్ ప్రకటించడం సందేహమే. దాని వల్ల చిరు ఇరుకున పడతాడు. ఐతే నాగబాబు మద్దతు నేపథ్యంలో చిరు సపోర్ట్ ఆటోమేటిక్ సపోర్ట్ ఉంటుందన్న భావనలో ‘మా’ సభ్యులు ఉన్నారు. ఆ భావన అలాగే ఉండటం మంచిదని.. అదే తనకు లాభం చేకూరుస్తుందని.. చిరును ఇందులోకి లాగి ఆయన్ని ఇరుకున పెట్టడం ఎందుకని ప్రకాష్ రాజ్ యోచిస్తుండొచ్చు.