టీకాల పేరుతో.. ప్ర‌ముఖ సినీ నిర్మాత‌కే మ‌స్కా కొట్టాడుగా!

క‌రోనా వ్యాప్తితో దేశం అల్లాడుతున్న వేళ‌.. దీనిని అడ్డు పెట్టుకుని సంపాయించుకునేందుకు అనేక మంది ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ప్రాణాధార‌మైన మందులు, ఔష‌ధాల‌ను.. బ్లాక్‌మార్కెట్ చేసిన వారు వేల‌లో ఉన్నారు. ఇక‌, ఇదికూడా కాకుండా.. ఏకంగా.. ఆయా మందుల పేర్లు చెప్పి.. ఆన్‌లైన్‌లో మోసాల‌కు తెగ‌బ‌డిన వారు కూడా ఉన్నారు. మ‌రికొంద‌రు ఆన్‌లైన్‌లో ముందుగానే డ‌బ్బులు క‌ట్టించుకుని.. త‌ర్వాత ప‌క్కాగా కుచ్చుటోపీ పెట్టినోళ్లు కూడా ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు క‌రోనా టీకా వంతు వ‌చ్చింది. క‌రోనా టీకా పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి సినీ హీరో, విక్ట‌రీ వెంక‌టేష్‌.. అన్న‌.. ప్ర‌ముఖ‌ నిర్మాత సురేశ్ బాబునే మోసం చేశాడు. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం అని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో త‌మ కుటుంబాలు, బంధువుల‌కు వ్యాక్సిన్ వేయించేందుకు సురేష్‌బాబు ప్ర‌య‌త్నించారు. పెద్ద‌మొత్తంలో 500 వ్యాక్సిన్ డోసులు కొనుగోలుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో నాగార్జున రెడ్డి అనే వ్య‌క్తి ప‌రిచ‌య‌మ‌య్యారు. అది కూడా ఫోన్‌లోనే.

ఓ రోజు.. నాగార్జున రెడ్డే ఫోన్ చేసి.. 500 డోసుల వ్యాక్సిన్ ఉంద‌ని చెప్ప‌డంతోపాటు వెంట‌నే అమ్ముతాన‌ని.. ల‌క్ష రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్పాడు. దీంతో సురేష్‌బాబు ఓకే అని.. నాగార్జున రెడ్డి భార్య లక్ష్మి అకౌంట్లో లక్ష రూపాయలు వేశారు. అయితే.. ఎంత‌కీ వ్యాక్సిన్ చేర‌క‌పోవ‌డంతో.. అతను మాటలు నమ్మిన సురేశ్ బాబు… మోస‌పోయిన‌ట్టు గుర్తించారు. నిందితుడు డబ్బులు డ్రా చేసుకుని.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో సురేశ్ బాబు పీఏ రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.