ఫ్యామిలీ మ్యాన్-3పై క్రేజీ రూమర్


ఇండియాలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ గురించి ముందుగా చెప్పుకోవాలి. స్కామ్ 1992, మీర్జాపూర్, సేక్ర్డ్ గేమ్స్, స్పెషల్ ఆప్స్ లాంటి సిరీస్ కూడా సూపర్ హిట్టయ్యాయి కానీ.. వాటితో పోలిస్తే దీని రీచ్ ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేసిన సిరీస్ ఇది. తొలి సీజన్ సూపర్ హిట్టయ్యాక రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో సీజన్ మరింతగా ఆకట్టుకుంది. ఒక పెద్ద సినిమాకు ఉన్నంత బజ్ కనిపించింది విడుదలకు ముందు. అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా రెండో సీజన్ ఉండటంతో దీన్ని ప్రేక్షకులు విరగబడి చూస్తున్నారు.

రెండో సీజన్ మేకింగ్ దశలో ఉండగానే మూడో సీజన్ కోసం ప్రణాళికను రచించారు దర్శకులు రాజ్-డీకే. సెకండ్ సీజన్ చివర్లో మూడో సీజన్ గురించి హింట్ కూడా ఇవ్వడం తెలిసిందే. ఈసారి కథ కోల్‌కతాకు మారబోతోంది. భారత్‌ను దెబ్బ కొట్టేందుకు చైనా చేసే కుట్రను ఛేదించే నేపథ్యంలో తర్వాతి సీజన్ నడవబోతోంది.

మూడో సీజన్ కోసం ఇప్పటికే కాస్టింగ్ ఎంపిక కూడా మొదలైందట. అందులో లీడ్ విలన్ పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారట రాజ్-డీకే. నిజానికి తమిళ టైగర్ల నేపథ్యంలో నడిచే రెండో సీజన్ కోసమే విజయ్‌ను అడిగిందట ఈ దర్శక ద్వయం. ఐతే ఇందులో ఎల్టీటీఈ నాయకుడిగా నటించడానికి విజయ్ ఒప్పుకోలేదట. ఆ పాత్రను చేసి ఉంటే విజయ్‌కి కచ్చితంగా ఇబ్బందులు తప్పేవి కావు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ బయోపిక్ చేయబోతుంటేనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు విజయ్.

ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో చేయకపోయినా.. మూడో సీజన్లో మాత్రం విజయ్‌ను నటింపజేయాలని రాజ్-డీకే పట్టుదలతో ఉన్నారని.. ప్రధాన విలన్ పాత్రను అతణ్ని దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేస్తున్నారని.. ఈసారి విజయ్ కచ్చితంగా ఈ సిరీస్‌లో నటించే అవకాశముందని అంటున్నారు. ఇదే నిజమైతే మనోజ్ బాజ్‌పేయి-విజయ్ సేతుపతిల ఎపిక్ క్లాష్ ఈ సిరీస్‌కు పెద్ద ఆకర్షణగా మారడం ఖాయం.