మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పెద్ద హీరోగా ఎదిగితే.. ఆయన పెద్ద కూతురు సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన ప్రతిభను చాటుకుంది. చిరంజీవితో పాటు చరణ్ సినిమాలకూ ఆమె స్టైలింగ్ చేసింది. ఇప్పుడామె నిర్మాతగా తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో గత ఏడాది కొత్త బేనర్ మొదలుపెట్టిన సుస్మిత తన భర్త విష్ణుతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది.
‘షూటౌట్ అట్ ఆలేరు’ పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ జీ స్టూడియోస్ వాళ్ల ఓటీటీలో రిలీజై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం సుస్మిత సినిమా నిర్మాణానికి కూడా రెడీ అవుతోంది. ఆమె నిర్మాణంలో రాబోయే తొలి చిత్రం రీమేక్. ‘8 తొట్టకల్’ అనే తమిళ చిత్రం రీమేక్ హక్కులను సుస్మిత కొన్ని నెలల కిందటే సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి కాస్ట్ అండ్ క్రూ వెతికే పనిలో ఉంది సుస్మిత కొన్ని నెలలుగా.
హీరో కోసం కొన్ని పేర్లు పరిశీలించి చివరికి ‘ఏక్ మినీ కథ’తో హిట్టు కొట్టిన యంగ్ హీరో సంతోష్ శోభన్‌ను ఓకే చేసినట్లు తాజా సమాచారం. తమిళంలో నాలుగేళ్ల కిందట విడుదలై మంచి విజయం సాధించిన ‘8 తొట్టకల్’కు శ్రీ గణేష్ దర్శకత్వం వహించాడు. అతనే తెలుగులోనూ డైరెక్షన్ చేయబోతున్నాడట. తమిళంలో వెట్రి అనే కొత్త హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు. హీరోది పోలీస్ పాత్ర కావడం విశేషం.
ఐతే పక్కింటి కుర్రాడిలా కనిపించే సంతోష్ శోభన్ ఇంటెన్స్ పోలీస్ రోల్‌లో ఎలా చేస్తాడన్నది ఆసక్తికరం. ఇందులో హీరో అయిన పోలీస్.. ఒక నేరస్థుడిని పట్టుకునే క్రమంలో తన రివాల్వర్ కోల్పోతాడు. దాన్ని దొంగిలించిన వ్యక్తి మరొకరికి దాన్ని అమ్ముతాడు. దీంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో రీమేక్ చేయగా.. అక్కడా హిట్టయింది. ఇప్పుడు సుస్మిత ఈ చిత్రాన్ని తెలుగులో తీయబోతోంది.