దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ ఇక లేరు. ఇది భారత క్రీడాభిమానులకు వేదన కలిగించే విషయమే. ఈ తరం వాళ్లకు మిల్కా గొప్పదనం తెలియకపోవచ్చు. కానీ మిల్కా జీవితం గురించి, ఆయన సాధించిన ఘనతల గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు సలాం కొట్టకుండా ఉండలేం. కేవలం క్రీడాకారుడిగా సాధించిన ఘనతలు మాత్రమే ఆయన్ని గొప్పవాణ్ని చేసేయలేదు.
మిల్కా ఏ పరిస్థితుల నుంచి అంతర్జాతీయ స్థాయిలో మేటి అథ్లెట్ అయ్యాడో తెలుసుకుంటే ఆయనెంత గొప్పవారో అర్థమవుతుంది. కేవలం వికీపీడియాలో మిల్కా గురించి చదువుకుంటూ పోతే ఎమోషన్ ఏమీ ఉండదు. అందుకోసం ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందించిన ‘బాగ్ మిల్కా బాగ్’ సినిమా చూడాలి. మిల్కా జీవితాన్ని అద్భుత రీతిలో ప్రెజెంట్ చేసిన చిత్రమిది.
దేశ విభజన సమయంలో పాక్ భూభాగంలో ఉన్న తమ గ్రామంపై ముస్లింలు జరిగిన దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి.. ఆ తర్వాత శరణార్థిగా తన అక్కతో కలిసి భారత్‌కు వచ్చి.. యుక్త వయసులో చదువుకోకుండా దొంగతనాలు చేసుకుంటూ బతికి.. ఆపై తాను ప్రేమించిన అమ్మాయి కోసం సైన్యంలో చేరి.. అక్కడ పాలు, గుడ్డు ఇస్తారన్న ఒకే కారణంతో పరుగు పందేల్లో పోటీ పడి.. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఆసక్తి పుట్టి అందులో నైపుణ్యం సంపాదించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన అరుదైన నేపథ్యం మిల్కా.
ఈ విషయాలన్నింటినీ సినిమాలో ఎంతో హృద్యంగా.. ప్రేక్షకులను కదిలించేలా చూపించాడు రాకేష్ మెహ్రా. మిల్కా పాత్రలో ఫర్హాన్ నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ఆ సినిమా చూశాక మిల్కా మీద ఎనలేని గౌరవ భావం ఏర్పడుతుంది. డాక్యుమెంటరీలా కాకుండా వినోదాత్మకంగా, ఉద్వేగభరితంగా సాగే ‘బాగ్ మిల్కా బాగ్’ తప్పక చూడాల్సిన చిత్రం. ఈ దిగ్గజ అథ్లెట్‌కు ఆ చిత్రం గొప్ప నివాళి అనడంలో సందేహం లేదు.