నేవీ ఆఫీసర్ గా ‘కేజీఎఫ్’ స్టార్!

‘కేజీఎఫ్’ సినిమా రిలీజయ్యే వరకు హీరో యష్ అంటే కన్నడ వారికి తప్ప మరెవరికీ తెలియదు. అప్పటివరకు కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన యష్ ని ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ ని చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా యష్ కి క్రేజ్ ఏర్పడింది. ‘కేజీఎఫ్’లో యష్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ని తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడనుంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత యష్ దర్శకుడు నార్తన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇందులో హీరో యష్ నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్లుగా యష్ ని కొత్త లుక్ లో ఎంతో స్టైలిష్ గా ప్రెజంట్ చేయాలని మేకర్లు భావిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

జీ స్టూడియోస్, హోంబలే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. తమన్నాను తీసుకోవడం వలన తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.