కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి రోజు రోజుకూ తగ్గుతుండటంలో మళ్లీ ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్డౌన్-కర్ఫ్యూ షరతులు సడలిస్తున్నారు. వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. సినీ రంగంలో కూడా కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్ మళ్లీ మొదలైంది. రాబోయే కొన్ని వారాల్లో అన్ని సినిమాలూ సెట్స్ మీదికి వెళ్లబోతున్నాయి. ఆ తర్వాత థియేటర్ల మీదికి ఫోకస్ వెళ్లబోతోంది. జులై 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను పున:ప్రారంభించాలని చూస్తున్నారు.
ఐతే ముందుగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో కరోనా ప్రభావాన్ని బట్టి ఆ తర్వాతి నెలకు 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతిస్తారనే ఆశతో ఉన్నారు నిర్మాతలు. అందుకు అనుగుణంగా కొత్త చిత్రాల రిలీజ్లు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విడుదలకు సిద్ధంగా ఉండి కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగిపోయిన లవ్ స్టోరీ, టక్ జగదీష్ చిత్రాలను ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ‘లవ్ స్టోరి’ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఆగస్టు 13న ‘పుష్ప’ రావాల్సిన తేదీకి ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేస్తారని అంటున్నారు. తర్వాత రెండు వారాల విరామంలో నాని సినిమా ‘టక్ జగదీష్’ వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఈ చిత్ర బృందాలు పరస్పరం సమాచారం కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది.
‘విరాట పర్వం’కు సంబంధించి ఇంకో పది రోజుల చిత్రీకరణ మిగిలుండటంతో వచ్చే నెలలో దాన్ని పూర్తి చేసి వీలును బట్టి ఆగస్టులో లేదా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ‘నారప్ప’ సైతం ఈ రెండు నెలల్లోనే ఏదో ఒక వారాంతంలో విడుదలయ్యే అవకాశముంది. ఇక ‘ఆచార్య’ సినిమాను దసరాకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.