ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తున్న సమయంలో ఈ యాక్సిండెంట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు విజయ్ స్నేహితుడు నవీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో పాటు ఒక వ్యక్తి చావుకి కారణమైన నవీన్ పై ఐపీసీ 279, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని ప్రకారం నిందితుడికి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ నెల 12న రాత్రి 11:30 గంటలకు బెంగుళూరు జేపీఏ నగర్ లోని సౌత్ సిటీ వద్ద విజయ్, నవీన్ ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అవ్వడంతో అక్కడే ఉన్న ఎలక్ట్రికల్ పోల్ కి బలంగా ఢీకొట్టింది. దీంతో విజయ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన బ్రెయిన్ డెడ్ అవ్వడంతో చనిపోయారు. విజయ్ అవయవాలను కుటుంబ సభ్యులు డొనేట్ చేశారు.
ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ప్రకటించారు. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. పదేళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో నటిస్తూ.. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్. ‘అవనల్ల అవళు’ సినిమాలో అతడు పోషించిన హిజ్రా పాత్రకు నేషనల్ అవార్డు దక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates